
లెనోవో చేతికి మోటరోలా
మోటరోలా మళ్లీ చేతులు మారనుంది. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌కు 22 నెలల పాటు మోటరోలాతో ఉన్న బంధానికి తెరపడింది.
మొబైల్స్ వ్యాపారాన్ని విక్రయించనున్న గూగుల్...
డీల్ విలువ 2.91 బిలియన్ డాలర్లు
మోటరోలా పేటెంట్లు మాత్రం గూగుల్ వద్దే..
మొబైల్స్ మార్కెట్లో యాపిల్, శామ్‌సంగ్‌తో పోటీకి లెనోవో ప్రణాళికలు
బీజింగ్/హ్యూస్టన్: మోటరోలా మళ్లీ చేతులు మారనుంది. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌కు 22 నెలల పాటు మోటరోలాతో ఉన్న బంధానికి తెరపడింది. చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవోకు మోటరోలా మొబిలిటీ వ్యాపారాన్ని(మొబైల్ ఫోన్ల తయారీ) విక్రయించాలని గూగుల్ నిర్ణయించింది. ఈ మేరకు లెనోవోతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 2.91 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.18,000 కోట్లు)గా గూగుల్ వెల్లడించింది. తద్వారా ఒక చైనా కంపెనీ విదేశాల్లో జరిపిన అదిపెద్ద టెక్నాలజీ టేకోవర్ డీల్‌గా ఇది నిలవనుంది.
గూగుల్ కొన్నది 12.5 బిలియన్ డాలర్లకు...
ఒకప్పుడు మొబైల్ ఫోన్‌ల తయారీలో అగ్రగామిగా వెలుగొందిన మోటరోలా క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయి చివరకు దివాలా తీయడం తెలిసిందే. దీన్ని 2012లో గూగుల్ 12.5 బిలి యన్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే, తాజాగా లెనోవోతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కేవలం మొబైల్ ఫోన్ల తయారీ వ్యాపారాన్ని మాత్రమే గూగుల్ విక్రయించింది. మోటరోలాకు ఉన్న 17,000 కీలక పేటెంట్లు మాత్రం తనవద్దే అట్టిపెట్టుకోవడం విశేషం. మోటరోలా కేబుల్ బాక్స్ వ్యాపారాన్ని ఇదివరకే గూగుల్ అమ్మేసింది. కాగా, లెనోవోతో డీల్‌ను అమెరికా, చైనా ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంటుంది.
వారంలో రెండో భారీ డీల్...
అంతర్జాతీయంగా కంప్యూటర్ హార్డ్‌వేర్, మొబైల్స్ తయారీలో దూసుకెళ్తున్న లెనోవో... ఐబీఎంకు చెందిన పర్సనల్ కంప్యూటర్ల తయారీ వ్యాపారాన్ని 2005లోనే చేజిక్కించుకుంది. దీంతో ప్రపంచంలో టాప్ పీసీ తయారీ కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. అలాగే ఈ నెల 24న ఐబీఎం లో-ఎండ్ సర్వర్ల బిజినెస్‌ను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మోటరోలాను దక్కించుకోవడంతో వారం వ్యవధిలోనే రెండు భారీ కొనుగోళ్ల డీల్స్‌ను లెనోవో కుదుర్చుకున్నట్లయింది. కాగా, మొబైల్స్ మార్కెట్లో వెనుకబడిన మరో దిగ్గజం బ్లాక్‌బెర్రీని లెనోవో కొనుగోలు చేయనుందని ఇదివరకే కథనాలొచ్చాయి. మోటరోలాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఊహాగానాలకు ప్రస్తుతానికి తెరపడినట్లే.
శామ్‌సంగ్, యాపిల్‌తో పోటీ...
అంతర్జాతీయంగా మొబైల్ హ్యాండ్‌సెట్ల(ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌లు) మార్కెట్‌ను శాసిస్తున్న శామ్‌సంగ్, యాపిల్‌లతో ఇక లెనోవో పోటీపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మోటరోలా కొనుగోలుతో అంతర్జాతీయంగా మొబైల్స్ మార్కెట్లో మరింత విస్తరించేందుకు దోహదం చేస్తుందనేది వారి అభిప్రాయం. ‘పేరొందిన బ్రాండ్, వినూత్న ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో, ప్రపంచవ్యాప్తంగా అత్యంత నైపుణ్యంగలిగిన సిబ్బంది ఉన్న మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్లో గ్లోబల్ శక్తిగా అవతరించేందుకు మాకు అవకాశం లభించనుంది’ అని లెనోవో చైర్మన్, సీఈఓ యాంగ్ యువాన్‌క్వింగ్ వ్యాఖ్యానించారు. ఐడీసీ గణాం కాల ప్రకారం... శామ్‌సంగ్, యాపిల్‌ల తర్వాత ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో చైనా దిగ్గజం హ్యువాయ్ మూడో స్థానంలో(4.9% వాటా) నిలుస్తోంది. ఆలస్యంగా ఈ విభాగంలోకి అడుగుపెట్టిన లెనోవో కూడా 4.5 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉంది(చైనాలో టాప్-2). ఇప్పుడు మోటరోలా డీల్‌తో మూడో స్థానంలోకి రావచ్చనేది యువాన్‌క్వింగ్ అంచనా. 2015లో 10 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఆయన చెప్పారు. లెనోవో గతేడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో 13.6 శాతం మార్కెట్ వాటాతో భారత్‌లో రెండో అతిపెద్ద పీసీల విక్రేతగా నిలిచింది.
ఎందుకు అమ్మేసింది...
{పపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్లో గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
దీంతో తనే మొబైల్ హ్యాండ్‌సెట్లను కూడా తయారు చేసి విక్రయిస్తే ఈ రంగంలోనూ అగ్రస్థానాన్ని కొల్లగొట్టవచ్చని గూగుల్ యోచించింది. ఈ ప్రణాళికతోనే దివాలాతీసిన మోటరోలాను కొనుగోలు చేసింది.
అయితే, ఈ ప్లాన్ గూగుల్‌కు ఏమంత కలిసిరాలేదు. శామ్‌సంగ్, యాపిల్ ఇతరత్రా దిగ్గజాల ముందు చేతులెత్తేసింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్ వాటా 2012లో 2.3%గా ఉండగా... 2013లో ఇది 1%కి పడిపోయినట్లు రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది.
గూగుల్ కొనుగోలు చేసిన తర్వాత మోటరోలా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై ‘మోటో ఎక్స్’, ‘మోటో జీ’ పేర్లతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. టెక్నాలజీపరంగా మంచి మార్కులే పడినప్పటికీ వీటి సేల్స్ అంతంతే.
మరోపక్క, మోటరోలా ఆదాయం కూడా భారీగా పడిపోతూ వచ్చింది. గతేడాది మూడో క్వార్టర్(జూలై-సెప్టెంబర్)లో ఆదాయం 1.18 బిలియన్ డాలర్లకు పడిపోయింది(2012 ఇదే క్వార్టర్‌లో 1.78 బిలియన్ డాలర్లు). గతేడాది క్యూ3లో నష్టాలు మరింత తీవ్రతరమై 25.9 కోట్ల డాలర్లకు చేరాయి.
ఈ ప్రతికూల పరిస్థితులన్నింటీ బేరీజు వేసుకునే ఇక మోటరోలా మొబిలిటీ వ్యాపారాన్ని గూగుల్ వదిలించుకుందననేది నిపుణుల విశ్లేషణ.