విప్లవ పోరాటంలో ఫెడల్‌ క్యాస్ట్రో - చేగువేరా.. | Sakshi
Sakshi News home page

విప్లవ పోరాటంలో ఫెడల్‌ క్యాస్ట్రో - చేగువేరా..

Published Sat, Nov 26 2016 1:30 PM

విప్లవ పోరాటంలో ఫెడల్‌ క్యాస్ట్రో - చేగువేరా..

సరైన ఆలోచన ఎంత ముఖ్యమో దానిని పక్కాగా అమలుచేయడమూ అంతే ప్రధానం. ఇక సాయుధపోరాటంలో ఎత్తుగడలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. క్యూబా విప్లవ పోరాటంలో ఫెడల్‌ క్యాస్ట్రో ఆలోచన అయితే అతని అమ్ములపొదిలోని ప్రధాన ఆయుధం చేగువేరా. ఎక్కడో పుట్టి, పరాయి దేశంలో సమసమాజ స్థాపన కోసం తుపాకి పట్టిన చేగువేరాకు, అతని పరాక్రమానికి ఎల్లవేళలా ప్రోత్సాహం ఇస్తూ విప్లవాన్ని విజయవంతం చేయడంలో ఫెడెల్‌ క్యాస్ట్రో అనుసరించిన తీరు చరిత్రలో అరుదైన ఘట్టం.

1950 దశకం నుండి క్యూబాలో అమెరికా అనుకూల బటిస్టా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. చెరుకు రైతులతోపాటు సాధారణ ప్రజల జీవితాలనూ పీల్చి పిప్పిచేస్తూ నాటి ప్రభుత్వంపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆవేశాన్ని విప్లవానికి అనుకూలంగా మలచడంలో ఫెడల్‌కు చేగువేరా అందించిన సహకారం అనిర్వచనీయం. 1956లో ఫిడెల్ క్యాస్ట్రో తన 80 మంది అనుచరులను ‘గ్రాన్మా’ నౌకలో తీసుకొనిపోయి బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక విఫల ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే తర్వాతి రెండేళ్ళ కాలంలో విప్లవంగా మారిపోయింది. బృందాలుగా విడిపోయిన విప్లవ సైన్యాలు.. తాము ప్రయాణించే మార్గంలో తారాసపడే గ్రామాలకు వెళ్లి, రైతులు, కూలీలతో సమావేశాలు నిర్వహించేవారు. వాళ్లని పోరాటానికి ఉద్యుక్తుల్ని చేసేవారు.

వైద్యుడిగా ఫెడల్‌ విప్లవ సైన్యంలో చేరిన చేగువేరా.. మాక్సిజం, లెనినిజంల పంథాను సహచరులకు మరింత అర్థమయ్యేలా వివరించేవాడు. అతనిలోని బోధకుడిని గుర్తించిన ఫెడల్‌.. రైతులు, కూలీలతో నిర్వహించే సమావేశాల్లో చేగువేరాను మాట్లాడాల్సిందిగా ప్రోత్సహించేవాడు. దోపిడి, తిరుగుబాటు, పోరాటం, విప్లవం, సమానత్వం, కమ్యూనిజం, సోషలిజం.. ఒక్కటేమిటీ అన్ని అంశాలను పామరుడికి సైతం అర్థమయ్యేలా వివరించడం, యుద్ధక్షేత్రంలో ఏమాత్రం బెరుకులేకుండా దూసుకెళ్లడం చేగువేరా సహజనైజం. చే విధానాలకు ఏనాడూ అడ్డుచెప్పని ఫెడల్‌.. చివరికి గువేరా క్యూబాను విడిచిపెట్టాలనుకున్నప్పుడు కూడా అదేపని చేశాడు. తనలా చేగువేరా ఒక దేశానికే పరిమితమైపోయేవాడు కాదు.. ‘ప్రపంచ పోరాట యోధుడు’ అని అందరికన్నా ముందు గుర్తించింది ఫెడల్‌ క్యాస్ట్రోనే.

చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. రచయితగా, గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిపొందిన చేగువేరా మోటర్‌ బైక్‌పై వివిధ దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయాడు. మెక్సికోలో రావుల్ క్యాస్ట్రో, ఫెడైల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు. ప్రసిద్ధ ‘జూలై 26 విప్లవం’లో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. విప్లవం విజయవంతం అయిన తర్వాత ప్రధాని హోదాలో ఫెడల్ క్యాస్ట్రో.. క్యూబాకు ఆయువుపట్టైన చక్కెర, పరిశ్రమల శాఖకు చేగువేరాను మంత్రిగా నియమించాడు. ప్రస్తుతం క్యూబా ప్రపంచ చెక్కెర గిన్నె(సుగర్‌ బౌల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌)గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.

విప్లవం అనంతరం ఒక దేశంగా క్యూబా మనుగడ సాధించాలంటే ప్రపంచంలోని మిగతా దేశాలతో(ఒక్క అమెరికాతో తప్ప) సఖ్యత అత్యవసరమైంది. ఆ బాధ్యతను కూడా ఫెడల్‌ క్యాస్ట్రో.. చేగువేరాకే అప్పగించాడు. క్యూబా విదేశాంగ మంత్రి హోదాలో చే.. భారత్‌ సహా రష్యా, శ్రీలంక, జపాన్‌, చైనా తదితర దేశాల్లో పర్యటించి, కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుని క్యాస్ట్రో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అధికార నిర్వహణ కంటే విప్లవం పురుడుపోసుకుంటున్న మిగత లాటిన్ అమెరికా, ఆఫ్రికన్‌ దేశాలకు తన సేవలు అవసరమని భావించిన చేగువేరా క్యూబా విడిచి బొలీవియా వెళ్లాలనుకున్నాడు. నిజానికి చేగువేరా లాంటి తురుపుముక్కను వదులుకోవడానికి ఏ రాజనీతిజ్ఞుడూ సిద్దపడడు. కానీ అది విప్లవ పోరాటం. అక్కడ వ్యక్తిగత స్నేహాలకు తావులేదు. అందుకే దేశాధినేతగా కాకుండా ప్రియమైన స్నేహితుణ్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ఫెడల్‌ క్యాస్ట్రో.. చేగువేరాకు వీడ్కోలు పలికాడు. బొలీవియాలో ప్రభుత్వ సేనలతో పోరాడుతూ 1967 అక్టోబర్ 9న చే మరణించాడు.

 
Advertisement
 
Advertisement