భద్రతా సిబ్బంది గోప్యత కాపాడండి | Sakshi
Sakshi News home page

భద్రతా సిబ్బంది గోప్యత కాపాడండి

Published Thu, May 25 2017 12:58 PM

Ensure identity of paramilitary personnel is not revealed: Delhi High court to Centre

న్యూఢిల్లీ: సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది వ్యక్తిగత సమాచారం బహిర్గతంకాకుండా చూడాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కొందరు పారామిలిటరీ జవాన్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు ఇటీవల ఓ టీవీ చానెల్‌లో ప్రసారం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతో తీవ్రమైన విషయమని, సైనికుల సమాచారం బయటకు ఎలా వచ్చిందని జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవా ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీవీ కార్యక్రమం ఎపిసోడ్‌లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖలను కోర్టు కోరింది. సైనికుల వ్యక్తిగత సమాచారం బయటకు తెలిస్తే, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అభిప్రాయపడింది. అలాగే పై రెండు మంత్రిత్వ శాఖలతో పాటు, టీవీ చానెల్, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీలకు నోటీసులు జారీచేస్తూ, వాటి సమాధానాలు కోరింది. టీవీ చానెల్‌ పలువురు పారామిలిటరీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సమాచారాన్ని బహిర్గతం చేసిందని ఆరోపిస్తూ మాజీ సైనికుడు ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 19కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement