 
															చిన్నమ్మకు మరిన్ని కష్టాలు??
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే (అమ్మ) అధినేత్రి వీకే శశికళకు..
	చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే (అమ్మ) అధినేత్రి వీకే శశికళకు మరిన్ని కష్టాలు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకే (అమ్మ) నేతలు భారీగా ఓటర్లకు డబ్బులు పంచిందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకమైన ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఆమె నియామకం ఎంతవరకు చెల్లుతుందనే అంశాన్ని ఈసీ పరిశీలించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
	
	జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీగా శశికళ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె నియామకం ఎంతవరకు ప్రామాణికం అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాతే.. ఆర్కే నగర్ ఉప ఎన్నిక తేదీలను ప్రకటించాలని ఈసీ భావిస్తున్నదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ఎన్డీటీవీ’  పేర్కొంది.
	
	రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈఎన్నికను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం అన్నాడీఎంకేకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకు నగదును ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
