రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై కసరత్తు ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై కసరత్తు ప్రారంభమైంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతితో కలసి డీవోపీటీ అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాధికారులు అర్చనావర్మ, కె.కిప్‌జెన్, ఎస్.నాయక్, ప్రతాప్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్కే సిన్హా తదితరులు పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలనే అంశం మీదే చర్చ సాగింది.
రెండు వారాల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామని కమల్నాథన్ పేర్కొన్నారు. ఉద్యోగుల విభజనపై విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.స్థానికతనా లేక మరింకేమైనా అంశాలను ఆధారం చేసుకోవాలా అన్న దానిపై చర్చించినట్లు కమల్ నాథన్ తెలిపారు. దీనిపై మరోసారి సమావేశమవుతామని స్పష్టం చేశారు. జూన్ రెండు కల్లా ఉద్యోగుల విభజన పూర్తి చేస్తామన్నారు.