Sakshi News home page

ఆ బీఎండబ్ల్యూ కానుక.. తిరిగి ఇచ్చేస్తుందట!

Published Wed, Oct 12 2016 12:12 PM

ఆ బీఎండబ్ల్యూ కానుక.. తిరిగి ఇచ్చేస్తుందట! - Sakshi

రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన పీవీ సింధు, సాక్షి మాలిక్‌, దీపా కర్మాకర్‌లకు క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చేతుల మీదుగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఖరీదైన కానుకను మెయింటెన్‌ చేయలేక తిరిగి ఇచ్చేద్దామనుకుంటోంది దీపా కర్మాకర్‌. రియో ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన దీపకు, సింధు, సాక్షిలతోపాటు బీఎండబ్ల్యూ కారును హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీ చాముండేశ్వరినాథ్‌ బహూకరించిన సంగతి తెలిసిందే.

ఈ కారును భరించడం తనకు తలకుమించిన బరువు కావడంతో దానిని తిరిగి చాముండేశ్వరినాథ్‌కు ఇవ్వాలని ఆమె నిర్ణయించినట్టు తెలుస్తోంది. అగర్తలా వంటి చిన్న నగరంలో అంతటి ఖరీదైన, విలాసవంతమైన కారును ఉపయోగించడం దీప, ఆమె కుటుంబానికి కష్టంగా మారడం.. అగర్తలాలో ఇరుకురోడ్లు గుంతలు, గోతులతో అస్తవ్యస్తంగా ఉండటం వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని సమాచారం. అంతేకాకుండా వచ్చేనెలలో జర్మనీలో జరగబోయే చాలెంజర్స్‌ కప్‌ కోసం దీప సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ మెయింటెన్స్‌ భరించే స్థోమత ఆమె వద్ద లేదని, అంతేకాకుండా ఎక్కువ సమయాన్ని ఆమె ప్రాక్టీస్‌ మీద దృష్టిపెట్టడంతో దీనిని ఉపయోగించే పరిస్థితి కూడా లేదని, అందుకే తిరిగి ఇచ్చేద్దామని భావిస్తున్నదని దీప కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది తెలిపారు. కారు తిరిగి ఇచ్చేద్దామన్న నిర్ణయం నిజానికి దీపది కాదని, కానీ దీప కుటుంబం, తాను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.

Advertisement

What’s your opinion

Advertisement