
వాళ్లు రెచ్చగొట్టడం వల్లే..
ఆప్ నేతల వల్లే రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ నేతల వల్లే రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రైతును కాపాడేందుకు తాము చేసిన అన్ని ప్రయత్నాలకు ఆప్ నేతలు, కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. వారు రెచ్చగొట్టడం వల్లే రైతు ప్రాణాలు తీసుకున్నాడని తెలిపారు. తమకు సహకరించాలంటూ ఎన్నిసార్లు విన్నవించినా వేదికమీద ఉన్న నాయకులుగానీ, ఆప్ కార్యకర్తలుగానీ వినిపించుకోలేదన్నారు. సహాయం కోసం వచ్చే వాహనాలకు దారి ఇవ్వాల్సిందిగా కోరినా పట్టించుకోలేదని రెండు పేజీల ఎఫ్‌ఐఆర్‌లో పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎస్ యాదవ్ పేర్కొన్నారు.
గజేంద్రసింగ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో కూడా ఆప్ కార్యకర్తలు అడ్డుతగిలారని, ఆయన తమ కార్యకర్త కాబట్టి పార్టీ వాహనాల్లోనే తీసుకువెళ్తామంటూ పట్టుబట్టారన్నారు. గురువారం ఉదయమే ఢి ల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఆత్మహత్య ఉదంతంపై ఒక నివేదిక సమర్పించారు. కాగా, ఈ ఘటనపై ఓవైపు తాము దర్యాప్తు జరుపుతుండగా.. మరోవైపు జిల్లా మేజిస్ట్రేట్‌తో న్యాయ విచారణకు జరిపించే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదని పోలీసు విభాగం స్పష్టంచేసింది. న్యాయ విచారణ జరిపే అధికారం జిల్లా మేజిస్ట్రేట్‌కు లేదని పేర్కొంటూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు బస్సీ చెప్పారు.