
'మహాకూటమిపై నిర్ణయం నాన్నదే'
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఉత్తరప్రదేశ్ లోనూ మహాకూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఉత్తరప్రదేశ్ లోనూ మహాకూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. బహుజన సమాజ్ వాది పార్టీ, ఇతర పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తెరపైకి తెచ్చారు. దీనిపై యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు.
మహాకూటమిపై నిర్ణయం తన తండ్రి ములాయం చేతుల్లో ఉందని తెలిపారు. మహాకూటమి ఏర్పాటు చేయాలా, వద్దా అనేది తానేలా చెబుతానని ప్రశ్నించారు. ఏ నిర్ణయమైనా పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డ్, ములాయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎస్పీ, బిఎస్పీ జట్టు కట్టే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు. ఆర్జేడీ-జేడీ(యూ)తో పోల్చుకుంటే ఎస్పీ-బిఎస్పీ మధ్య సంబంధం భిన్నమైనదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన దృష్టాంతా రాష్ట్రాభివృద్ధిపైనే అని చెప్పారు.
నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారానికి మీరు, మీ తండ్రి హాజరవుతారా అన్న ప్రశ్నకు అఖిలేశ్ సమాధానం ఇవ్వలేదు. అలాగే ఈనెల 22న జరగనున్న ములాయం జన్మదిన వేడుకలకు నితీశ్, ములాయం హాజరవుతారా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించలేదు.