పంట రుణాల చెల్లింపునకు గడువు పెంపు | crop loan payment extend for another three months : central govt | Sakshi
Sakshi News home page

పంట రుణాల చెల్లింపునకు గడువు పెంపు

Dec 21 2016 1:52 AM | Updated on Sep 27 2018 9:08 PM

పంట రుణాల చెల్లింపునకు గడువు పెంపు - Sakshi

పంట రుణాల చెల్లింపునకు గడువు పెంపు

పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు శుభవార్త.

60 రోజుల పాటు పెంచిన కేంద్ర ప్రభుత్వం
నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 లోపు చెల్లించాల్సిన వాటికి మాత్రమే..
 
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు శుభవార్త. ఈ ఏడాది నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 లోపు చెల్లించాల్సిన మూడు శాతం ప్రోత్సాహకంతో కూడిన పంట రుణాల చెల్లింపు గడువును మరో 60 రోజులు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు ఓ రైతు ఈ ఏడాది నవంబర్‌ 15న పంట రుణం చెల్లించాలనుకోండి. ఆ గడువుకు మరో 60 రోజుల తర్వాత ఆ రుణాన్ని చెల్లించవచ్చు. తద్వారా మూడు శాతం వడ్డీ రాయితీని ప్రోత్సాహకం కింద కూడా పొందవచ్చు.

ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌ కుమార్‌ భుటాని తెలిపారు. ప్రభుత్వం 2016–17లో రూ. 9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి రూ. 7.56 లక్షల కోట్ల రుణాలు రైతులకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. వడ్డీ రాయితీ పథకం కింద రైతులు ఏడాదికి ఏడు శాతం వడ్డీతో తీసుకున్న స్వల్పకాలిక రుణాలను సకాలంలో (ఏడాది లోపు) చెల్లిస్తే మూడు శాతం వడ్డీ రాయితీ ప్రోత్సాహకం కింద లభిస్తుంది. ఆ గడువు దాటిపోతే ఈ ప్రోత్సాహకం లభించదు. కాగా కేంద్ర, రాష్ట్ర విత్తన కంపెనీల వద్ద విత్తనాల కొనుగోలుకు రూ. 500 నోట్లు అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement