కార్పొరేట్ ఉన్నత విద్య సమాజానికి పనికి వచ్చేది కాదని, అది పెట్టుబడిదారులకు సేవ చేసేదిగానే ఉంటుందని పలువురు విద్యావేత్తలు పేర్కొన్నారు.
విద్యా పరిరక్షణ కమిటీ
హైదరాబాద్: కార్పొరేట్ ఉన్నత విద్య సమాజానికి పనికి వచ్చేది కాదని, అది పెట్టుబడిదారులకు సేవ చేసేదిగానే ఉంటుందని పలువురు విద్యావేత్తలు పేర్కొన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి డబ్ల్యూటీఓ- గ్యాట్స్ (జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ) ఒప్పందానికి ఇచ్చిన సంసిద్ధతను భారత్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, నైరోబీలో డిసెంబర్‌లో జరిగే డబ్ల్యూటీఓ ఒప్పందంలో భారత్ భాగస్వామి కావొద్దని కోరుతూ ఇందిరాపార్కు వద్ద ఆదివారం విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
అంతకు ముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చక్రధర్‌రావు, ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, డాక్టర్ ఎం.గంగాధర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ‘గ్యాట్స్’ ఒప్పందంలో భారత్ చేరితే ఉన్నత విద్యలో ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారం మరింత విచ్చలవిడిగా పెరుగుతుందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంలో చేరితే దేశంలో ఉన్నత విద్య సామాన్యులకు అందకుండా పోతుందన్నారు.