ధనికులపై ఎల్‌వీబీ దృష్టి

ధనికులపై ఎల్‌వీబీ దృష్టి


హెచ్‌ఎన్‌ఐ ఖాతాదారులకు వ్యక్తిగత అధికారి

హైదరాబాద్‌లో హెచ్‌ఎన్‌ఐ లాంజ్

కొత్తగా మారో 100 శాఖలు, 200 ఏటీఎంల ఏర్పాటు

వచ్చే ఏడాది వ్యాపారంలో 20 శాతం వృద్ధి అంచనా

లక్ష్మీ విలాస్ బ్యాంక్ సీవోవో విద్యాసాగర్


 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  పాత తరం లక్ష్మీ విలాస్ బ్యాంక్... కొత్త ప్రైవేటు బ్యాంకులకు దీటైన పోటీ ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. దీన్లో భాగంగా వేగంగా శాఖల్ని విస్తరించటం... కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై దృష్టిసారిస్తోంది. ముఖ్యంగా అధికాదాయ వర్గాల వారిని ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లతో పాటు వారికోసం ప్రత్యేక శాఖలను కూడా ఏర్పాటుచేసే ఆలోచనలో ఉంది. టేకోవర్ల ముప్పు నుంచి తప్పించుకోవడానికి సొంతంగా బలపడటంపై దృష్టి పెడుతున్నామంటున్న బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విద్యాసాగర్‌తో ‘సాక్షి’ఇంటర్వ్యూ...  వ్యాపార విస్తరణ ఈ ఏడాది వ్యాపారంలో 18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. డిసెంబర్ నాటికి బ్యాంకు వ్యాపార పరిమాణం సుమారు రూ.34,000 కోట్లకు చేరింది. ఇది మార్చి నాటికి రూ.38,000 కోట్లకు చేరుతుంది. వచ్చే ఏడాది కనీసం 20 శాతం వృద్థి శాతాన్ని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం దక్షిణాది పాత తరం ప్రైవేటు బ్యాంకుగా ఉన్న ముద్రను చెరిపి కొత్తతరం ప్రైవేటు బ్యాంకుగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాం. ఇందులో భాగంగా దేశవ్యాప్త విస్తరణపై దృష్టి సారించాం. గత రెండేళ్ళలో కొత్తగా 110 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా  మొత్తం శాఖల సంఖ్య 400కి చేరింది. వచ్చే 12 నెలల కాలంలో కొత్తగా మరో 100 శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు ఏటీఎంల సంఖ్యను 800 నుంచి 1,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.ఎలాంటి మార్పులంటే... అధికాదాయ వర్గాల వారిని ఆకర్షించడానికి ‘క్రౌన్’ పేరుతో కొత్త సేవలను ప్రారంభించాం. ఈ ఖాతాదారులకు ఏటీఎంల విత్‌డ్రాయల్స్, డెబిట్ కార్డులలతో పాటు, రూ.25 లక్షల ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నాం. దేశవ్యాప్తంగా 40 శాఖల్లో ఈ ఖాతాదారులకు సేవలను అందించడం కోసం ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేశాం. బెంగళూరు శాఖలో క్రౌన్ లాంజ్‌ను ఏర్పాటు చేశాం. త్వరలోనే హైదరాబాద్ సహా 5 నగరాల్లో ఈ లాంజ్‌లను ఏర్పాటు చేస్తాం. వీటి తర్వాత హెచ్‌ఎన్‌ఐల కోసం ప్రత్యేకంగా క్రౌన్ శాఖనే ఏర్పాటు చేస్తాం. ఇవికాక సేవింగ్స్ ఖాతాలో రూ.లక్షపైన ఉన్న మొత్తానికి 5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాం. ప్రస్తుతం కరెంట్, సేవింగ్స్ (కాసా) డిపాజిట్లు 14 శాతంగా ఉన్నాయి. మార్చినాటికి ఇవి 18 శాతానికి చేరుతాయని అంచనా వేస్తున్నాం.బడ్జెట్ తరవాతే వడ్డీ రేట్లపై స్పష్టత...బడ్జెత్ తర్వాత కానీ వడ్డీరేట్ల తగ్గింపుపై స్పష్టత రాదు. ప్రస్తుత సంకేతాలను బట్టి చూస్తే వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత రుణాలకు వడ్డీరేట్ల తగ్గింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తగ్గించే ఆలోచనలోనే ఉన్నాం. ప్రస్తుతం బేస్ రేట్ 11.25 శాతంగా ఉంది.నిధుల కొరత లేదు...ప్రస్తుతానికి నిధుల కొరత లేదు. ఈ మధ్యనే రూ.460 కోట్లు సేకరించాం. రుణాలకు డిమాండ్ బాగా పెరిగి వృద్ధి బాగుంటే అప్పుడు అదనపు నిధులు అవసరమవుతాయి. ఆ సమయంలో నిధులను ఏ మార్గంలో సేకరించాలన్న విషయాన్ని పరిశీలిస్తాం. ప్రస్తుతం బాసెల్ 3 నిబంధనల కింద సీఏఆర్ 12.47 శాతంగా ఉంది. పోటీని తట్టుకుంటేనే...


పేమెంట్ బ్యాంకులు, కొత్త బ్యాంకులు రావడం వల్ల బ్యాంకింగ్ రంగంలో పోటీతత్వం పెరుగుతుంది. ఈ పోటీని తట్టుకుంటేనే నిలబడంగలం. అందుకే కొన్ని పెద్ద బ్యాంకులు వ్యూహాత్మకంగా చిన్న బ్యాంకులను టేకోవర్ చేస్తున్నాయి. ప్రస్తుతం టేకోవర్లపై మేం ఎవరితోనూ చర్చలు జరపడం లేదు.పుకార్లకు అడ్డుకట్ట పడాలంటే బ్యాలెన్స్‌షీట్‌ను పటిష్టం చేసుకోవాలి. ఇప్పుడు మా దృష్టంతా ఎన్‌పీఏలను తగ్గించుకొని బ్యాలెన్స్ షీట్ మెరుగుపర్చుకోవడంపైనే ఉంది. మార్చి నాటికి స్థూల ఎన్‌పీఏలను 3 శాతం కిందకు, నికర ఎన్‌పీఏలను 2 శాతం కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డిసెంబర్ నాటికి స్థూల ఎన్‌పీఏలు 3.4 శాతం, నికర ఎన్‌పీఏలు 2.37 శాతంగా ఉన్నాయి.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top