పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఎంపిక చేసే పద్ధతికి భిన్నంగా... పార్టీ కార్యకర్తలు, కింది శ్రేణి నాయకులే ఎన్నుకునే (ప్రైమరీస్) విధానాన్ని ఈ సారి కొన్ని నియోజకవర్గాల్లో అమలుచేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికల కోసం తొలిసారి కాంగ్రెస్ ప్రయోగం
న్యూఢిల్లీ: పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఎంపిక చేసే పద్ధతికి భిన్నంగా... పార్టీ కార్యకర్తలు, కింది శ్రేణి నాయకులే ఎన్నుకునే (ప్రైమరీస్) విధానాన్ని ఈ సారి కొన్ని నియోజకవర్గాల్లో అమలుచేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ, అనుబంధ విభాగాల కార్యకర్తలతో ఒక ఓటర్ల జాబితాను రూపొందించి... ఎన్నికలు నిర్వహించనుంది. ఈ తరహాలో అభ్యర్థులను ఎన్నుకొనే విధానాన్ని ప్రవేశపెడతామని గతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు కూడా. అయితే, మొట్టమొదట కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న దేశరాజధాని న్యూఢిల్లీ పార్లమెంటు నియోజకవర్గంలో దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు. మొత్తంగా ఈ సారి దేశవ్యాప్తంగా 15 పార్లమెంటు నియోజకవర్గాల్లో ‘ప్రైమరీస్’ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా నియమించిన నెట్టా డిసౌజా వెల్లడించారు.
24వ తేదీన పార్టీ ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
బరిలో ఉండదలచుకున్న అభ్యర్థులు 27వ తేదీ వరకు నామినేషన్లు వేయవచ్చు.
అనంతరం ఒక తేదీని ప్రకటించి, ఎన్నికలు నిర్వహిస్తారు.
న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం అనంతరం ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈశాన్య ఢిల్లీ స్థానంలో ‘ప్రైమరీస్’ నిర్వహిస్తారు.
నేరపూరిత నేపథ్యం ఉన్న అభ్యర్థులు, ఓటర్లను ఈ ప్రక్రియలో పాల్గొనకుండా.. దూరం పెట్టనున్నారు.
కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ మహిళా సంఘటన్, వ్యాపార్ మండల్ తదితర అనుబంధ విభాగాల కార్యకర్తలు, ఆఫీసు బేరర్లు అభ్యర్థుల ఎన్నికలో పాల్గొనవచ్చు.
వీరితోపాటు వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, బార్ అసోసియేషన్లు, ఇంజనీర్లు, ట్రేడర్లు తదితర సంఘాల జిల్లా అధ్యక్షులు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.
కాగా, ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ విధానాన్ని అనుసరిస్తున్నారా.. అని ప్రశ్నించగా ‘ఇలాంటి చర్యలను ఆమ్ ఆద్మీ ఎప్పుడూ తీసుకోలేదు, అమలుచేయలేదు. ఇది రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయం’’ అని డిసౌజా పేర్కొన్నారు.