అటు బిల్లు.. ఇటు రాజీనామా ! | Congress high command ready to play new drama with Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

అటు బిల్లు.. ఇటు రాజీనామా !

Feb 12 2014 3:04 AM | Updated on Jul 29 2019 5:31 PM

అటు బిల్లు.. ఇటు రాజీనామా ! - Sakshi

అటు బిల్లు.. ఇటు రాజీనామా !

అటు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన రోజే ఇటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది.

ఎంపీల బహిష్కరణతో పార్టీకి మరికొందరు రాజీనామాలు చేయొచ్చు
వారికి నాయకత్వం వహించేందుకు మార్గం సుగమం చే స్తూ సీఎంతో రాజీనామా
అసెంబ్లీలో గందరగోళం రేకెత్తించి, ఆపై సభలోనే రాజీనామా ప్రకటన
కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్న మరో 50 మంది ఎమ్మెల్యేలు
బహిష్కృత ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో సీఎం ధర్నా!
రెండు ప్రాంతాల్లో సీఎం పీఠం కోసం అప్పుడే మొదలైన లాబీయింగ్

 
 న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అటు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన రోజే ఇటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి సీఎంకు పార్టీ పెద్దలు మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే రాజీనామా చేస్తానని సీఎం ఇంతకు ముందు ప్రకటన చేయడం తెలిసిందే. ఆ మేరకే ఆయన తో రాజీనామా చేయించేలా పార్టీ పెద్దలు ముందుకు వెళ్తున్నారు.
 
  కాంగ్రెస్ నుంచి ఎంపీల బహిష్కరణపై గుంటూరులో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ... ఇది దురదృష్టకరమనీ, సోనియాగాంధీ ఆదేశిస్తేనే సీఎం రాజీనామా చేస్తారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఎంపీలపై బహిష్కరణ చర్యలతో మరింత మంది పార్టీ నుంచి రాజీనామాలు చేయవచ్చని, ఆ సమయంలోనే వారందరికీ నాయకత్వం వహించేలా సీఎంతో కూడా రాజీనామా చేయించాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా స్పష్టమవుతోంది. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. అవకాశం లభిస్తే సభలోనే ఆయనతో రాజీనామా ప్రకటన చేయించాలని భావిస్తున్నారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సభలో తీవ్ర గందరగోళం రేకెత్తించి ఆపై సీఎంతో రాజీనామా ప్రకటన చేయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్పాయి.
 
  ఈ గందరగోళంలోనే ఓటాన్ అకౌంట్‌ను ఆమోదించి సభను ముగించనున్నారని ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించి ఇదివరకే రూపొందించిన రోడ్‌మ్యాప్‌పై హైకమాండ్ పెద్దలు మంగళవారం నాటి కోర్‌కమిటీ భేటీలో చర్చించారు. సీఎం, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్య వాదనను వినిపించేందుకు వీలు లేకుండా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సభను స్తంభింపచేస్తారని, ఆ సమయంలో సీఎం అక్కడ్నుంచి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందించేలా కార్యాచరణను నిర్దేశించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న నేపథ్యంలో సీఎం రాజీనామా చేస్తే దాన్ని గవర్నర్ ఆమోదిస్తారా? లేక తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై కూడా కోర్ కమిటీలో చర్చించారు.
 
 రాజీనామాలకు 50 మంది ఎమ్మెల్యేలు సిద్ధం
 పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టకుండా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంతోపాటే రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన రోజే ఈ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు... దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు పదవికి, పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుండటం, అదే సమయంలో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవనే నిర్ణయానికి రావడంతో ఇక పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదనే అంచనాకు వచ్చినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కొత్త పార్టీ పెడతారని ఇదివరకే ప్రచారం సాగుతున్నందున వారంతా సీఎం వెంటే నడిచేలా వ్యూహం రూపొందించినట్టు ఆ నేతలు పేర్కొంటున్నారు.
 
 హస్తినలో ధర్నా యోచన: రాజీనామా అనంతరం రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులందరితోపాటు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిరణ్ ఢిల్లీలో ధర్నా చేయనున్నారని సీఎం సన్నిహిత మంత్రి ఒకరు చెప్పారు. జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు వేలాది మందిని తరలించనున్నట్లు తెలిసింది. జనాన్ని తరలించే బాధ్యతను లగడపాటి రాజగోపాల్‌తో సహా కొందరు ఎంపీలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈనెల 15న వేలాది మందిని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు 7 ప్రత్యేక రైళ్లను బుక్ చేయించే పనిలో లగడపాటి నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.
 
 సీఎం పీఠం కోసం లాబీయింగ్: తెలంగాణ, సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు సీఎం పీఠం కోసం పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతకు సీఎం పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ భావిస్తే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య రేసులో ఉంటారు. వీరిలో డిప్యూటీ సీఎం, డీఎస్, సర్వే ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. గత రెండ్రోజులుగా డీఎస్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలిశారు. తాజాగా డిప్యూటీ సీఎం మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో కలిసి కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌షిండే, జైరాం రమేశ్‌తోపాటు దిగ్విజయ్‌సింగ్‌ను దామోదర కలిసినట్లు తెలిసింది.
 
 మేం సైతం అంటున్న ఆనం, రఘువీరా, కన్నా..
 సీమాంధ్ర విషయానికొస్తే సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ పేర్లు జోరుగా విన్పిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీఎం పీఠం కోసం యత్నిస్తున్నప్పటికీ ఆయనకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే కన్నా గత రెండ్రోజులుగా హస్తినలో మకాం వేశారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ వచ్చిన కన్నా పనిలో పనిగా సీఎం సీటు కోసం లాబీయింగ్ తీవ్రతరం చేశారు. సోమవారం సాయంత్రం కన్నా.. దిగ్విజయ్‌సింగ్‌ను కలిసినట్టు తెలిసింది. ఆ తర్వాత దిగ్విజయ్‌సింగ్ స్వయంగా కన్నా లక్ష్మీనారాయణను వెంటబెట్టుకుని టెన్ జన్‌పథ్‌కు వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది.
 రాష్ట్రపతి పాలన వైపు: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన త ర్వాత రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ సంక్షోభ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోనియా అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే రచించిన వ్యూహాన్ని నడిపించడంలో భాగంగా అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించడంపై సమావేశంలో చర్చించినట్టు సమాచారం.
 
 మంత్రులతో సీఎం భేటీ..: కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కొందరు మంత్రులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు. ఎంపీలపై బహిష్కరణ వేటుపై చర్చించారు. సమావేశం నుంచే ఆయన ఎంపీలతో ఫోన్లో మాట్లాడారు. పార్లమెంటులో  అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడారు. మంత్రులు పితాని సత్యనారాయణ, అహ్మదుల్లా, కొండ్రు మురళీ మోహన్, కాసు కృష్ణారెడ్డి తదితరులు సీఎంతో భేటీ అయిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement