ప్రతిపక్షాన్ని సందిగ్ధంలో పడేసింది...

రాష్ట్రపతి అభ్యర్థిపై విపక్షాల సందిగ్ధం - Sakshi


న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా ఓ దళితుడిని ఖరారు చేయడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్షాన్ని సందిగ్ధంలో పడేసింది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆరెస్సెస్‌)తో అనుబంధం ఉన్న కారణంగా తాము ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తామని సీపీఐ, సీపీఎం పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే యోగి ఆదిత్యనాథ్‌ , భాగవత్‌ లాగా కరడుగట్టిన హిందూత్వ వాది కాకపోవడం వల్ల రామ్‌నాథ్‌ కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని ఎలా వ్యతిరేకించాలో తెలియక కాంగ్రెస్‌ పార్టీ తలపట్టుకు కూర్చుంది. ఒక విధంగా ‘టుబీ నాట్‌ టుబీ’ పరిస్థితి ఏర్పడింది. ఇక దళితుడిని ఎలా వ్యతిరేకిస్తామని బహుజన సమాజ్‌ పార్టీకి చెందిన మాయావతి లాంటి నాయకులు వాపోతున్నారు.



ఉత్తరప్రదేశ్‌లో ‘భీమ్‌ ఆర్మీ’ లాంటి మరో దళిత ఫోరమ్‌ ఏర్పాటు వల్ల ఇప్పటికే ఆందోళన పడుతున్న మాయావతి, రామ్‌నాథ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా దళితులను దూరం చేసుకోలేనని చెబుతున్నారు. బలమైన కారణం లేకుండా యూపీకి చెందిన రామ్‌నాథ్‌ ఎలా కాదనాలో తెలియక సమాజ్‌వాది పార్టీ నాయకులు అఖిలేష్‌ యాదవ్‌ ఆందోళన చెందుతున్నారు. దళిత వ్యతిరేకులమనే ముద్ర తమకెందుకని ఇతర ప్రతిపక్ష పార్టీలు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా దళిత అభ్యర్థినే ఖరారు చేయడం మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తం కావడంతో మీరా కుమార్‌ లాంటి పేర్లను పరిశీలిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి.



ఓ దళిత అభ్యర్థికి వ్యతిరేకంగా మరో దళిత అభ్యర్థిని నిలబెడితే ‘రాజకీయం’ చేస్తున్నారనే అపవాదు వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన పడుతుంది. దళిత అభ్యర్థినే పార్టీ కోరుకున్నట్లయితే రామ్‌నాథ్‌ కోవింద్‌నే తాము సమర్థించవచ్చని పార్టీ సీనియర్‌ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. కోవింద్‌కు వ్యతిరేకించాలంటే ఆయనకు ధీటైన వ్యక్తిని నిలబెడితేనే తాము మద్దతు ఇవ్వగలమని ఇటు మాయావతి, అటు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌లు అంటున్నారు. దళిత అభ్యర్థిపై దళిత అభ్యర్థిని నియమిస్తే తమదీ రాజకీయం అంటారన్న ఆందోళన కాంగ్రెస్‌కే కాకుండా దళిత పార్టీలకు కూడా ఉంది.



దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్‌ నారాయణ్‌ను కనుక ఈసారి దళిత మహిళకు ఆ అవకాశం ఇవ్వడం మంచిదనే వాదనను బలంగా వినిపిస్తూ మీరా కుమార్‌ లాంటి వారిని రంగంలోకి దించుతే సమంజసంగా ఉండవచ్చు. పోటీ నుంచి తప్పుకుంటే అన్ని విపక్షాలను కలుపుకొని  2019 లోక్‌సభ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా లౌకిక సంకీర్ణ కూటమి ఎదగాలన్న ఆశ, ఆశయం నీరుగారిపోతుంది. రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని తేల్చడానికి ఈ నెల కాంగ్రెస్‌ నాయకత్వాన విపక్షాలు సమావేశమవుతున్న విషయం తెల్సిందే.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top