తీవ్ర నిర్లక్ష్యం : భారీ మూల్యం | Chennai Silks fire: Insurance firm New India Assurance to assess loss | Sakshi
Sakshi News home page

తీవ్ర నిర్లక్ష్యం : భారీ మూల్యం

Jun 2 2017 8:55 AM | Updated on Aug 20 2018 9:35 PM

చెన్నైలోని టీనగర్‌ లోని ‘చెన్నై సిల్క్స్‌’ భవనంలో చెలరేగిన అ‍గ్ని కీలలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.

చెన్నై: చెన్నైలోని టీనగర్‌ లోని  ‘చెన్నై సిల్క్స్‌’  భవనంలో చెలరేగిన అ‍గ్ని కీలలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.  కనీస భద్రతా చర్యల్ని పాటించడంలో చూపిన తీవ్ర నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వెరసి  కోట్ల  రూపాయల మూల్యం. దాదాపు 32 గంటలపాటు  అగ్ని గుండంలా  మండిన  ఏడంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది.   షార్ట్ సర్క్యూట్ కారణంగా   అంటుకున్న మంటల్ని ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు.  స్కై లిఫ్ట్‌  రప్పించి మరీ రక్షణ చర్యలు చేపట్టారు.  సుమారు 160 ఫైరింజన్లతో 250 మంది అగ్నిమాపక సిబ్బంది, చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ సిబ్బంది, స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఈ అగ్ని ప్రమాదంలో విలువైన లక్షల లీటర్ల  వృధా కావడంతో పాటు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.   300 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలగా, నార్త్ రీజియన్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ ఎం. షాహుల్ హమీద్‌ అంచనా ప్రకారం రూ .420 కోట్లు.

కొంత బంగారాన్ని తరలించారనిఅధికారులు చెబుతున్నప్పటికీ  సుమారు 400 కేజీల బంగారు ఆభరణాలు, 2 వేల కిలోల వెండి నగలు కరిగి బుగ్గి పాలయ్యాయి. 20 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలు సైతం  అగ్ని అహూతైనట్టు సమాచారం.  దీంతోపాటు మొదటి అంతస్తు నుంచి ఆరో అంతస్తు వరకు భద్రపరచిన 80 కోట్ల రూపాయలకు పైగా విలువైన దుస్తులు  మంటల్లో బూడిదగా మారాయి.   అయితే నష్టాన్ని అంచనావేసేందుకు  న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్  కసరత్తు చేస్తోంది. త్వరలో  ప్రమాదానికి గురైన చెన్నై సిల్క్స్ షోరూమ్‌ను తమ సర్వేయర్లు సందర్శించనున్నారని సీనియర్ బీమా అధికారి ఒకరు చెప్పారు.   

అలాగే రెవిన్యూ మంత్రి ఉదయకుమార్  అందించిన సమాచారం ప్రకారం, అగ్నిమాపక సిబ్బంది  31 గంటల  పోరాటం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. 85 వాటర్ ట్యాంకర్లను వినియోగించారు.  బుధవారం రాత్రి 10 గంటల వరకు 75 వాటర్ ట్యాంకర్లను, గురువారం ఉదయం 10 మంది ట్యాంకర్లు పిలిపించారు.  ఒక్కో ట్యాంకర్‌ సామర్ద్యం  6వేల  నుంచి 9 వేల లీటర్లు.  ఈ లెక్కల ప్రకారం 5 నుంచి 7లక్షల 65వేల లీటర్ల నీటిని ఈ  ఒకటిన్నర రోజులుగా కురిపించారు.  ఈ భారీ వ్యయంతో అసలే తీవ్రమైన  నీటి  ఎద్దడిని  ఎదుర్కొంటున్న చెన్నై నగరం మరింత విలవిల్లాడింది. 3.5 లక్షల కుటుంబాలు ఇబ‍్బందుల పాలయ్యాయి .ప్రధానంగా వెంటిలేషన్ లేకపోవడంతో దట్టమైన నల్లటి పొగ ఆవిరించి అగ్నిమాపకదళాలు లోనికి ప్రవేశించకుండా అడ్డుకుంది.  చివరికి  క్రేన్స్‌ సహాయంతో భవనం  ఎంట్రన్స్‌ పగలగొట్టాల్సి వచ్చింది. అగ్నిమాపక భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందువల్లే  ఈ భారీ మంటలు చెలరేగాయని,  నియంత్రణ కూడా చాలా కష్టమైందని అగ్నిమాపక అధికారులు   చెప్పారు. ఇక సందర్భంగా నగరంలో నెలకొ‍న్న ట్రాఫిక్‌ సంగతి సరేసరి.

మరోవైపు సీటీ పోలీసులు  ప్రమాదవశాత్తూ  జరిగిన అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేశారు.  ఉద్దేశ పూర్వక చర్య  లేదా కుట్ర లాంటి సంకేతాలేవీలేవని  సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.  అలాగే  జనరేటర్లకోసం  కొన్ని బారెళ్ల   డీజిల్ ను సెల్లార్‌ లో ఉంచినట్టు తమ  విచారణలో తేలిందన్నారు.   దర్యాప్తు కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులు దీనిపై పరిశీలన చేయనున్నారని  చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement