తిమింగలం ఎముకలతో కళాకృతులు | Brazilian artist makes sculptures from whale bones | Sakshi
Sakshi News home page

తిమింగలం ఎముకలతో కళాకృతులు

Jul 18 2014 7:28 PM | Updated on Sep 2 2017 10:29 AM

తిమింగలం ఎముకలతో కళాకృతులు

తిమింగలం ఎముకలతో కళాకృతులు

తిమింగలం ఎముకలతో కళాకృతులు తయారుచేస్తున్న బ్రెజిలీ కళాకరుడు హామిల్టన్ కోయెలో ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాడు.

తిమింగలం ఎముకలతో కళాకృతులు తయారుచేస్తున్న బ్రెజిలీ కళాకరుడు హామిల్టన్ కోయెలో ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాడు. అది కూడా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద బీచ్ ఒడ్డున ఉండటమంటే అతనికి మరీ ఇష్టం. దక్షిణ బ్రెజిల్‌లో ఉన్న ‘ప్రేయా డు క్యాసి’ బీచ్ దగ్గర కూర్చుని తనలో తాను జీవించేస్తాడు హామిల్టన్. బ్రెజిల్‌లో అతడి ఇల్లే ఆ దేశానికి చిట్టచివరిది. అట్లాంటిక్ సముద్రం దగ్గర నుంచి ఆ ఇల్లు స్పష్టంగా కనపడుతుంది. ఉరుగ్వే బోర్డర్‌కి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది ఆ ఇల్లు. ఆ ఇంటిని హామిల్టన్ స్వయంగా తయారుచేసుకున్నారు. ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన పాడైపోయిన ఓడ భాగాలతో ఆ ఇల్లు అందంగా నిర్మితమైంది.

 గత ఇరవై సంవత్సరాలుగా కోయెలో ఆ తీరంలో ఇటువంటి పురాతన నిధుల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. అక్కడ దొరికే గాజు సీసాల నుంచి, తుప్పు పట్టిన ట్రాక్టర్ వస్తువుల వరకు అన్నిటినీ అన్వేషిస్తూనే ఉన్నారు. దొరికిన వాటితో ఏదో ఒక కళాఖండాన్ని తయారుచేస్తూ ఆనందిస్తున్నారు. ఆయన తయారుచేసిన కళాకృతులతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. పెద్దపెద్ద తిమింగలం ఎముకలతో ఆయన తయారుచేసిన కళాకృతులు అందరినీ అబ్బురపరుస్తున్నాయి.

 ‘‘ఈ చోటు నాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. నిరంతరం ప్రవహిస్తూ, వైబ్రేషన్స్ ఇచ్చే సముద్రమంటే నాకు చాలా ఇష్టం.అవి నాలో చలనం కలిగిస్తాయి. నేను ఇక్కడే ఆనందంగా ఉంటాను. ఇక్కడ దొరికే వస్తువులే నాకు ఇష్టం. 15 సంవత్సరాల క్రితం షిప్‌రెక్ వస్తువులు నాకు లభించాయి. వాటితో నా ఇల్లు నిర్మించుకున్నాను. ఇక్కడకు కొట్టుకు వచ్చే తిమింగలం ఎముకలను తీసుకుని కళాకృతులు తయారుచేస్తున్నాను. అయితే వీటిని షేప్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఆ పని నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను. ఇక్కడ నేను గమనించిందేమిటంటే, తిమింగలాలు వయసు పైబడి కాకుండా వాటిలో ఉండే ఎగ్రెసివ్‌నెస్ వల్లే అవి మరణిస్తాయని తెలుసుకున్నాను’’ అంటారు హామిల్టన్.
 - వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement