
మా ముత్తాత ఎన్నో త్యాగాలు చేశారు!
దేశ ప్రథమ ప్రధానమంత్రి, కాంగ్రెస్ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు.
లక్నో: దేశ ప్రథమ ప్రధానమంత్రి, కాంగ్రెస్ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. ’దేశ ప్రథమ ప్రధాని అయిన నెహ్రూ ఒక రాజులాగా విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ప్రజలు అనుకుంటారు. వారికి తెలియనిదేమిటంటే.. నెహ్రూ 15 ఏళ్లు జైలులో గడిపితే ఆ పదవి వచ్చింది’ అని వరుణ్‌గాంధీ అన్నారు.
లక్నోలో జరిగిన ఓ యూత్ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ’ఎవరైనా వచ్చి నిన్ను జైలులో ఉంచి 15 ఏళ్ల తర్వాత ప్రధానిని చేస్తామంటే.. నేను మాత్రం ’క్షమించండి ఇది చాలా కష్టం’ అని చెప్తాను’ అని అన్నారు. దేశానికి విముక్తి సాధించడానికి నెహ్రూ తన జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేశాడని, గాయాలపాలయ్యాడని, ఆయన త్యాగాలను యువత గుర్తించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య పోరాటకాలంలో చిత్రంజన్ దాస్, నెహ్రూ భావజాలపరంగా ఒకవైపు నిలబడితే, లాలా లజపతిరాయ్ మరోవైపున నిలబడ్డారని అన్నారు. ’ అప్పట్లో వారి భావజాలాలు భిన్నమైనవి. ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్లో భావజాల సిద్ధాంతాలు ఉన్నాయని ఎవరైనా గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా’ అంటూ ఆయన ప్రశ్నించారు. దేశంలో భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పు పొంచి ఉందని వరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు.