
సంఘటనా స్థలంలో బర్మాన్ మృతదేహం
బతికున్న వ్యక్తిని రోడ్డు గుంతలో పూడ్చిపెట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
భోపాల్: బతికున్న వ్యక్తిని రోడ్డు గుంతలో పూడ్చిపెట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. గొయ్యిలో పడిపోయిన వ్యక్తిపై కంకర వేసి పాతిపెట్టారు. కాట్ని జిల్లాలోని ఉడ్లానా-హతా మార్గంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతుడు ఖాద్రా గ్రామానికి చెందిన లటోరి బర్మాన్(45)గా గుర్తించారు.
తన భార్యతో కలిసి రిషి పంచమి వేడుకలకు బర్మాన్ అత్తగారింటికి వెళ్లాడు. భార్య పుట్టింట్లో ఉండిపోవడంతో అతడు స్వగ్రామానికి పయనం అయ్యాడు. మార్గమధ్యలో లిక్కర్ షాపులో మద్యం సేవించాడు. రాత్రివేళ నడుకుంటూ వెళుతున్న క్రమంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయని రోడ్డు గొయ్యిలో పడిపోయాడు. అపస్మారకస్థిలోకి వెళ్లిపోవడంతో పైకి లేవలేకపోయాడు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరించి గుంతను పూడ్చివేశారు.
గుంత నుంచి బర్మాన్ చేయి బయటపడడంతో ఈ దారుణ ఉదంతం వెలుగు చూసింది. మృతుడి బంధువులు తమ గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపట్టారు. దీంతో మృతుడి కుటుంబానికి కలెక్టర్ రూ. 50 వేలు పరిహారం ప్రకటించారు. అయితే హెవీ మిషనరీతో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండడం వల్లె గొతిలో పడిన వ్యక్తిని గుర్తించలేకపోయారని విచారణాధికారి తెలిపారు.