భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు ఒకటి 18 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు ఒకటి 18 ఏళ్ల జైలుశిక్ష విధించింది. తన సంరక్షణలో ఉన్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతడికీ శిక్ష వేశారు. వినోద్ జానీ కుమార్ (31) అనే ఈ వ్యక్తి ఏమాత్రం సిగ్గులేకుండా.. సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూ చక్రాల కుర్చీలకు పరిమితమైన మహిళల మీద అత్యాచారాలు చేశాడని విక్టోరియా కౌంటీ కోర్టు న్యాయమూర్తి ఫెలిసిటీ హాంపెల్ వ్యాఖ్యానించారు. గతంలో 'యూరాలా'లో క్యాజువల్ కార్మికుడిగా పనిచేసిన కుమార్, ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు, మరికొందరిపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ సంఘటనలు 2011 అక్టోబర్, 2012 ఫిబ్రవరి నెలల మధ్య జరిగాయి.
విక్టోరియా ప్రాంతంలో యూరాలా అనే సంస్థ వికలాంగులకు సేవలు అందిస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ. అక్కడ వారి సంరక్షణ బాధ్యతలు చూసేందుకు ఉద్యోగంలో చేరి, ఇలాంటి నీచపు పనికి పాల్పడటం దారుణమని న్యాయమూర్తి అన్నారు. వాళ్లు తమను తాము రక్షించుకునే స్థితిలో కూడా లేరని ఆయన చెప్పారు. కుమార్ అప్పటికప్పుడు అనుకోవడమో లేదా అవకాశవాదంతో చేసిన పనో కాదని, అతడు పదే పదే ఈ నేరాలకు పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. అసహాయులైన మహిళలు అత్యాచారాలకు గురైనప్పుడు అక్కడ ఉన్న ఏకైక వ్యక్తి కుమారేనని కూడా న్యాయమూర్తి అన్నారు. ఇలాంటి దారుణమైన సంఘటనతో తాము చాలా కలత చెందినట్లు యూరాలా సంస్థ సీఈవో సంజీవ్ రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.