ప్రభావం చూపని బౌలర్లు.. టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం | Australia A Women Outclass India A In Unofficial Test | Sakshi
Sakshi News home page

ప్రభావం చూపని బౌలర్లు.. టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం

Aug 24 2025 3:21 PM | Updated on Aug 24 2025 3:55 PM

Australia A Women Outclass India A In Unofficial Test

బ్రిస్బేన్‌ వేదికగా భారత ఏ మహిళల జట్టుతో జరిగిన ఏకైక అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు సమాంతంరంగా నిలిచినా, రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించి, గెలుపు సొంతం చేసుకుంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆస్ట్రేలియా 305 పరుగులు చేసింది. 6 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 286 పరుగులకు ఆలౌటై, ఆసీస్‌ ముందు 281 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో బ్యాటర్లంతా తలో చేయడంతో ఆసీస్‌ 85.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

రేచల్‌ ట్రెనామన్‌ (64), మ్యాడీ డ్రేక్‌ (68), అనిక లియారాయ్డ్‌ (72) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్‌ తహిల విల్సన్‌ (46) ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. నికోల్‌ ఫాల్టుమ్‌ (16 నాటౌట్‌), ఎల్లా హేవర్డ్‌ (4) ఆసీస్‌కు విన్నింగ్స్‌ రన్స్‌ అందించారు.

281 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్‌ చేసుకోవడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్‌ రాధా యాదవ్‌ 8 మంది బౌలర్లు మార్చిమార్చి ప్రయోగించినా ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. సైమా ఠాకోర్‌ 2, జోషిత, తనుశ్రీ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు యామీ ఎడ్గర్‌ (19-6-57-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో, ప్రెస్ట్‌విడ్జ్‌ (13.4-2-47-3) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకే పరిమితమైంది. రాఘ్వి బిస్త్‌ (86) రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌ను ఆదుకుంది. షఫాలీ వర్మ (52) అర్ద సెంచరీతో రాణించింది. తేజల్‌ (39), తనుశ్రీ (25), టైటాస్‌ సాధు (22 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

శతక్కొట్టిన జింజర్‌
లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సియన్నా జింజర్‌ (103) సెంచరీతో రాణించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ స్కోర్‌కు ధీటుగా బదులిచ్చింది. జింజర్‌కు నికోల్‌ ఫాల్టుమ్‌ (54), తహిల విల్సన్‌ (49) సహకరించారు. భారత బౌలర్లలో సైమా ఠాకోర్‌ 3, రాధా యాదవ్‌, మిన్నూ మణి తలో 2 వికెట్లు పడగొట్టారు.

ఆదుకున్న రాఘ్వి
తొలి ఇన్నింగ్స్‌లో రాఘ్వి బిస్త్‌ (93), జోషిత (51) ఆదుకోవడంతో భారత్‌ 299 పరుగులు చేయగలిగింది. ఆసీస్‌ బౌలర్లలో బ్రౌన్‌, ప్రెస్ట్‌విడ్జ్‌ తలో 3 వికెట్లు తీశారు

కాగా, భారత ఏ మహిళల జట్టు మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ సిరీస్‌లో తొలుత టీ20 సిరీస్‌ జరగగా.. ఆసీస్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. అనంతరం భారత్‌ వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ఏకైక అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో గెలిచి ఆసీస్‌ సిరీస్‌ను చేజిక్కించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement