సీఎం యోగి ఎఫెక్ట్: గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్టు | acid attack on gang rape survivor, Yogi Adityanath visits her | Sakshi
Sakshi News home page

సీఎం యోగి ఎఫెక్ట్: గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్టు

Mar 24 2017 2:42 PM | Updated on Aug 17 2018 2:10 PM

సీఎం యోగి ఎఫెక్ట్: గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్టు - Sakshi

సీఎం యోగి ఎఫెక్ట్: గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్టు

ఆమె గ్యాంగ్‌రేప్ బాధితురాలు. ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం కోర్టులో పోరాడుతోంది. ఇంతలో తాజాగా ఇద్దరు వ్యక్తులు ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించారు.

ఆమె గ్యాంగ్‌రేప్ బాధితురాలు. ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం కోర్టులో పోరాడుతోంది. ఇంతలో తాజాగా ఇద్దరు వ్యక్తులు ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించారు. దాంతో చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చేరింది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. ఆమెకు తక్షణ సాయంగా లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు. ఆమెతో యాసిడ్ తాగించిన వాళ్లను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు.  2008 సంవత్సరంలో రాయ్‌బరేలిలో ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాక, యాసిడ్ పోశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. త్వరలోనే ఈ కేసు విచారణకు రానుంది. తమ కుటుంబానికి తరచు బెదిరింపులు వస్తున్నట్లు బాధితురాలి భర్త తెలిపారు.

ఇంతలో గురువారం నాడు తన పిల్లలను కలిసేందుకు లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊంచహార్‌కు వెళ్తుండగా ఆమెపై దాడి జరిగింది. ముఖ్యమంత్రి వచ్చి తమను పరామర్శించినందుకు సంతోషంగానే ఉందని.. అయితే నిందితులను అరెస్టు చేయాలని బాధితురాలి భర్త అన్నారు. యాసిడ్ దాడి బాధితులకు ఉద్యోగాలు కల్పించే కేఫ్‌లో ఆమె పనిచేస్తుంది. తాను నిరుపేదనని, అయినా తన భార్యను నమ్ముతాను కాబట్టే ఈ కేసులో పోరాడుతున్నానని ఆమె భర్త చెప్పారు.

ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి బాధితురాలిని పరామర్శించడంతో పాటు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా స్పీడుగా స్పందించారు. అత్యాచారం, దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసినట్లు అదనపు డీజీ ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటన జరిగిన రెండు గంటల్లోనే పోలీసుల నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement