నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | young lady died with current shock | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Jul 21 2014 2:11 AM | Updated on Jul 11 2019 7:48 PM

ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఎర్తింగ్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.

 గండేడ్: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఎర్తింగ్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. దీంతో పిండిగిర్ని ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతమవడంతో ఓ యువతి దుర్మరణం చెందింది. ఆగ్రహానికి గురైన స్థానికులు విద్యుత్ అధికారులను దిగ్బంధించారు.

ఈ సంఘటన మండల పరిధిలోని చిన్నవార్వాల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఖాజన్నగౌడ్, పద్మమ్మ దంపతుల రెండో కూతురు వెంకటేశ్వరి (22)బీఈడీ వరకు చదివింది. భార్యాభర్తలు కిరాణ దుకాణంతో పాటు ఓ పిండిగిర్నిని నడుపుతున్నారు. ఇంటి వద్ద ఉంటున్న వెంకటేశ్వరి తల్లిదండ్రులకు సాయంగా ఉంటోంది. ఈక్రమంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో పిండిగిర్ని ఆన్ చేసేందుకు వెళ్లిన ఆమెకు కరెంట్‌షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరుకుంది.

వెంకటేశ్వరిని ఆస్పత్రికి తరలించేందుకు 108కు సమాచారం ఇచ్చారు. గంటసేపు దాటినా ఫలితం లేకుండా పోవడంతో పొరుగు గ్రామం నుంచి ఓ ఆర్‌ఎంపీని తీసుకొచ్చి చూపించారు. అప్పటికే మహేశ్వరి మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. యువతి మృతితో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.

 పలు ఇళ్లకు కరెంట్ షాక్..
 గ్రామానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు మినీ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ సరిగా లేదు. దీంతో రెండు నెలలుగా పలు ఇళ్లకు హైఓల్టేజీ విద్యుత్ ప్రసారమై కరెంట్ షాక్ వస్తోంది. ఈక్రమంలోనే శనివారం రాత్రి కూడా హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అయింది. అదే సమయంలో పిండిగిర్ని ఆన్ చేసేందుకు వెళ్లిన వెంకటేశ్వరి విద్యుదాఘాతంతో దుర్మరణం పాలైంది. ఎర్తింగ్ సమస్యపై పలుమార్లు ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు తెలిపారు.

వెంకటేశ్వరి మృతితో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆదివారం ఏఈ జంగయ్య సిబ్బందితో చిన్నవార్వాల్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి యువతి బలైపోయిందని స్థానికు లు మండిపడ్డారు. గ్రామస్తులంతా అధికారులను చుట్టుముట్టి ఘెరావ్‌చేశారు. గ్రామంలోని ఎర్తింగ్ సమస్యను పరిష్కరించాకే ఇక్కడి నుంచి కదలాలని భీష్మించారు.

గ్రామంలో 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలే ఉన్నాయని, వాటిని తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. గ్రామానికి మరో రెండు మినీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో ఏఈ జంగయ్య ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది వెంటనే ఎర్తింగ్ సమస్యను పరిష్కరించారు. 15 రోజుల్లో అదనపు మినీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ తీగలు మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

 నెలరోజుల్లో ఇద్దరి మృతి..
 చిన్నవార్వాల్ గ్రామంలో ఎర్తింగ్ సమస్య ఇద్దరిని బలితీసుకుంది. శనివారం రాత్రి వెంకటేశ్వరి మృత్యువాత పడగా.. గతనెల 27న గ్రామానికి చెందిన బోయిని వెంకటయ్య సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. శనివారం రాత్రి గ్రామస్తుడు ఇక్బాల్ ఇంట్లో ఫ్యాన్ కాలిపోయి ఇంటి పైకప్పునకు షాక్ వచ్చింది. దీంతో పాటు గొల్ల లక్ష్మయ్య, బాబు ఇళ్లకు కూడా షాక్ వచ్చింది. దీంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. చివరకు అధికారుల హామీతో గ్రామస్తులు శాంతించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement