
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: వరుస వలసలతో కంగుతింటున్న కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలంపాటు పనిచేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2014, 2018 ఎన్ని కల్లో ఓడిపోయారు. మొన్నటివరకు పార్టీలో క్రియా శీలకంగా ఉన్న భిక్షమయ్య ఉన్నట్టుండి పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ విషయం ముందే టీపీసీసీ నాయకత్వం పసిగట్టి నిలువరించే ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు.
వారి కారణంగానే ఓడాను..
కోమటిరెడ్డి సోదరుల కారణంగానే ఆలేరు అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు సార్లు ఓటమి పాలయ్యానని.. తన ఉసురు వారికి తగులుతుందని భిక్షమయ్యగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనపై గత ఎన్నికల్లో కొందరిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దించి ఓటమికి కారణమయ్యారని ఆయన ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్‌ను మధుయాష్కీకి లేదా గ్రూపులు లేని బీసీ నేతలకు ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరామని, అయితే కోమటిరెడ్డి సోదరులు అడ్డుపడి వారే టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు.
అందుకే గెలవాలని మాయమాటలు
ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడానికి కోమటిరెడ్డి సోదరులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. దీంతో భువనగిరి లోక్‌సభ సీటును ఎలాగైనా గెల వాలని వారు మాయమాటలు చెబుతున్నారని భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం జరగలేదనే బాధతోనే కాంగ్రెస్ పార్టీ, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు భిక్షమయ్యగౌడ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సామాజిక న్యాయం పాటిస్తూ నల్లగొండలో ఓసీ, భువనగిరిలో బీసీకి టికెట్లు ఇచ్చారని పేర్కొన్నారు. తన అనుచరులతో కలసి రెండు, మూడ్రోజుల్లో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్, సంక్షేమ పథకాల వైపే ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, పదేళ్లపాటు తనకు సహకరించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన ధన్యావాదాలు తెలిపారు.