ఎక్స్‌రే గదికి తాళం!

x ray room have been locked since six months in ibrahimpatnam government hospital - Sakshi

ఇబ్రహీంపట్నంరూరల్‌ : యాచారం మండల కేంద్రానికి చెందిన మేరాజ్‌అంజూ అనే మహిళా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఎక్స్‌రే ఎక్కడ తీస్తారని సాధారణ రోగులను అడగడంతో మాకు తెలియదని చెప్పారు. ఆమెకు ఎదురుగా ఓ నర్సు వచ్చి ఇక్కడ ఎక్స్‌రే మిషన్‌ ఉంది కానీ ఎక్స్‌రే తీసే వారు లేరని వ్యంగంగా సమాధానం ఇచ్చింది. ప్రజా వైద్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయానికి ఇది నిలువెత్తు నిదర్శనం. బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన సిబ్బంది రోగులను, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేలా వ్యవహరిస్తున్నారు.

ఆరునెలలుగా వేసిన తాళం తీయ్యలే...
ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలతో పాటు ఇతర ప్రజలకు పెద్ద దిక్కైన పెద్దాస్పత్రి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖాన. ప్రజలకు నిరంతరం సేవలందిండచానికి గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వాణిప్రసాద్‌ చొరవతో పాత పెద్దాస్పత్రి బాగుపడింది. సకల సౌకర్యాలతో ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దితే మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంలాగా తయారైంది. అప్పట్లో అన్ని విభాగాలు పని చేసే విధంగా ఎక్స్‌రే మిషన్‌ తీసుకొచ్చి పెట్టారు. గతంలో డిజిటల్‌ ఎక్స్‌రే లేకపోవడంతో సంవత్సర కాలంగా రూ.లక్షల్లో వెచ్చించి డిజిటల్‌ ఎక్స్‌రే ఏర్పాటు చేశారు. పట్టుమని పది కాలాలు గడవక ముందే ఎక్స్‌రే గదికి తాళం వేశారు. శామీర్‌పేట్‌ నుంచి డిప్యూటేషన్‌ విధానంతో  ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వర్తించేవారు. జిల్లాల విభజన తర్వాత మేడ్చెల్‌కు కేటాయించడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆరు నెలల కాలంగా ఇబ్రహీంపట్నం ఎక్స్‌రే యంత్రానికి అతిగతి లేకుండా పోయింది. పేద ప్రజలకు ఎక్స్‌రేలు తీసేవారు కరువయ్యారు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే రూ.200–600 వరకు తీసుకుంటారు. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రి దిక్కవుతుందని అనుకుంటే టెక్నిషియన్‌ కొరత తీరడం లేదని వాపోతున్నారు. నిత్యం 600నుంచి 1000 రోగుల వచ్చే ప్రభుత్వఆస్పత్రికి వెంటనే ఎక్స్‌రే టెక్నిషియన్‌ మంజూరు చేయాలని కోరుతున్నారు.

ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తాం
స్థానిక ఆస్పత్రిలో ఇన్నాళ్లుగా ఎక్స్‌రే తీయడానికి ఆపరేటర్‌ లేకపోవడం చాలా బాధకరం. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల నిర్వహణకు అధిక నిధులు కేటాయిస్తుంది. ఆస్పత్రి యాజమాన్య కమిటీ చైర్మన్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్య పరిష్కరం అయ్యేలా చూస్తాం. పేద ప్రజలకు ఇలాంటి సమస్యలు మళ్లి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆరోగ్యశాఖదే.– జెర్కొని రాజు, ఇబ్రహీంపట్నం

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top