హాంఫట్ | Works properly or water leakage | Sakshi
Sakshi News home page

హాంఫట్

Apr 12 2016 1:12 AM | Updated on Sep 3 2017 9:42 PM

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చేపట్టిన పైపులైన్ పనులు పది రోజులు గడవకముందే లీకు అయ్యాయి.

రూ. పదిలక్షలు.. పదిరోజులు పనులు సరిగా లేక నీరు లీకేజీ
తూతూ మంత్రంగా మరమ్మతులు  పట్టించుకోని అధికారులు

 

పరకాల : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చేపట్టిన పైపులైన్ పనులు పది రోజులు గడవకముందే లీకు అయ్యాయి. పైపులైన్ లీకేజీ కావడంతో సంగం నీళ్లు భూమి పాలు అవుతుండగా మిగతా సంగం నల్లాల ద్వారా ఇళ్లకు చేరుతున్నాయి. లక్షలాది నిధులు కేటాయించి చేపట్టిన పైపులైన్ మూడు రోజుల మురిపెనంగా మారింది. పట్టణంలోని వెల్లంపల్లిరోడ్డు, సాయినగర్ కాలనీ, మల్లారెడ్డిపల్లిలో కొంతభాగానికి ఏడాది నుంచి నల్లా నీరు కరువైంది. ప్రధాన రోడ్డులోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వరకు రోడ్డు విస్తరించారు. బస్టాండ్ సెంటర్‌లో రోడ్డు వేయడంతో పైపులైన్ పగిలిపోవడంతో ఆమూడు కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. అప్పటి నుంచి ప్రజలు నీటి కోసం తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటి సరఫరా చేయడంతో అవి ఎటు సరిపోక ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు నీటి బాధను దూరం చేయడం కోసం రెండు నెలల క్రితం నీటి కరువు నివారణ కింద రూ.10 లక్షలు కేటాయించారు. పాత సీఎంఎస్ ట్యాంకు నుంచి సాయినగర్ కాలనీ, మల్లారెడ్డిపల్లి, వెల్లంపల్లి రోడ్డుకు పైపులైన్ నిర్మాణం చేపట్టారు.


730 మీటర్ల పొడవుతో చేపట్టిన పైపులైన్ నిర్మాణ పనులు పది రోజుల క్రితమే పూర్తికావడంతో కనెక్షన్ ఇచ్చారు. రెండు రోజులు నీళ్లు పోశాయో లేదో అంతలోనే పైపులైన్ లీకేజీ అయ్యింది. పశువుల సంతకు పోయే దారి పక్కనే పైపులైన్ లీకేజీ కావడంతో రోడ్డు మీద నుంచే కాల్వ మాదిరిగా పోయింది. నల్లాలు విడిచిన ప్రతిసారీ ఇదే పైపులైన్ నుంచి నీరు వృథాగా పోతోంది. కొత్త పైపులైన్ నుంచి అప్పుడే నీరు లీకేజీ కావడంతో అంతా ఆశ్చర్యంగా చూశారు. లక్షలు వెచ్చించి నిర్మాణం చేసింది లీకేజీల కోసమేనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తే అధికారులు చూసి చూడనట్లు వ్యవహారించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరంభంలోనే లీకేజీల పర్వం మొదలైతే తరువాత ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ తప్పును మట్టిలోనే కలిపే ప్రయత్నంలో భాగంగా అదే పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టారు. లీకేజీ అయిన చోట తవ్వి సిమెంట్‌తో అతికించారు. ఇలా అస్తవ్యస్తంగా ముగించిన పనులకు బిల్లులు విడిపించేందుకు అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈ రవీంద్రనాథ్ వివరణ కోరగా కొత్త పైపులైన్  లీకేజీ అయిన మాట వాస్తవమే. అది చిన్న లీకేజీ మాత్రమే. పైపులను కలిపే సందర్భంలో జాయింట్ లూజ్ అయింది. మళ్లీ మరమ్మతులు చేయించామని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement