
సాక్షి, నంద్యాల: శ్రీశైలం జలాశయం పదో నంబర్ గేట్ వద్ద భారీగా వాటర్ లీకేజీ అవుతోంది. గత నెలలో ఈ గేటు వద్ద మరమ్మతులు నిర్వహించినప్పటికీ భారీగా నీరు లీకేజీ కావడం గమనార్హం. జలాశయం అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా లీకేజీ జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
వివరాల ప్రకారం.. శ్రీశైలం జలాశయం పదో నంబర్ గేట్ వద్ద గత నెలలో అధికారులు రబ్బర్ సీల్స్ మార్చారు. వాటర్ లీకేజీ కారణంగా మరమ్మతులు నిర్వహించారు. దీని కోసం ప్రభుత్వం.. సుమారు కోటి ముప్పై లక్షలు నిధులను కేటాయించింది. కానీ, తాజాగా మరోసారి అక్కడే వాటర్ లీకేజీ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, నాసిరకంగా పనులు చేసినట్టు తెలుస్తోంది. లీకేజీ కావడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇక, జలాశయం అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద కొనసాగుతోంది. జూరాల నుండి 1,09,277 క్యూసెక్కులు నీటి ప్రవాహం శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది. సుంకేసుల నుండి 61,931 క్యూసెక్కులు నీరు వస్తోంది. ప్రస్తుతానికి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 1,71,208 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు.. ప్రస్తుతం :179.8995 టీఎంసీలుగా ఉంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జలాశయం గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
