అడ్డదారిలో యూఏఈకి..

Work Visa is Mandatory for Those Who Want to Work in UAE - Sakshi

కార్మికులను తరలిస్తున్న కొందరు లైసెన్స్‌డ్‌ ఏజెంట్లు

కమీషన్‌ ఎక్కువ పొందేందుకు ఎత్తుగడ

భారత ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు పొందలేకపోతున్న వలసజీవులు

విజిట్‌ వీసాపై వచ్చి ఉపాధి పొందడాన్ని నిషేధించిన యూఏఈ

సాక్షి, నిజామాబాద్‌ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు విజిట్‌ వీసాపై వెళ్లి ఉపాధి పొందాలనుకునేవారికి అక్కడి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఆ దేశంలో ఉపాధి పొందాలనుకుంటే ఇక నుంచి కచ్చితంగా వర్క్‌ వీసా ఉండాల్సిందే. ఈ నిబంధన గతంలోనే ఉన్నా ఇటీవల యూఏఈ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. విజిట్‌ వీసాలపై వచ్చి కల్లివెల్లి(అక్రమ నివాసులు)గా మారి పనిచేస్తున్న వారి సంఖ్య ఏటా పెరిగిపోతుండటంతో దీనిని నియంత్రించడానికి యూఏఈ చర్యలు చేపట్టింది. విజిట్‌ వీసాపై వచ్చిన వారిని పనిలో పెట్టుకోవద్దని కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. ఆ దేశంలో మన విదేశాంగ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రం సానుకూలంగా స్పందించింది. విజిట్‌ వీసాలపై వచ్చి ఉపాధి పొందాలనుకునేవారికి కలిగే నష్టాల గురించి వివరిస్తోంది. సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తూ కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఏం జరుగుతుందంటే..
యూఏఈకి ఇప్పటి వరకు విజిట్‌ వీసాపై వచ్చి వర్క్‌ వీసా పొందేందుకు అవకాశం ఉంది. కానీ, వర్క్‌ వీసా పొందిన కార్మికులు ఆ వెంటనే ఆ దేశం విడిచి వచ్చి.. ఆ తర్వాత వర్క్‌ వీసాపై మళ్లీ కొత్తగా యూఏఈకి వెళ్లి ఉపాధి పొందవచ్చు. అయితే, దీనిని ఆసరా చేసుకుని లైసెన్స్‌డ్‌ ఏజెంట్లు అక్రమార్జనకు దారులు తెరిచారు. యూఏఈ వర్క్‌ వీసా లభించకపోతే విజిట్‌ వీసాపై వెళ్లి ఏదైనా కంపెనీలో పని దక్కించుకునే అవకాశం ఉండటంతో ఏజెంట్లు కార్మికులను ఇదే తరహాలో ఆ దేశానికి తరలిస్తున్నారు. వర్క్‌ వీసా దొరికిన కార్మికులు ఢిల్లీ లేదా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న యూఏఈ రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపింగ్‌ చేయించుకుని వెళ్లడానికి అవకాశం ఉంది.

లైసెన్స్‌డ్‌ ఏజెంట్ల మోసాలు ఇలా..
అక్రమ వలసలను అరికట్టి, చట్టబద్ధమైన సురక్షిత వలసల కోసం ప్రభుత్వం లైసెన్స్‌లు మంజూరు చేస్తోంది. అయితే, ఈ లైసెన్స్‌లు పొందిన రిజిస్ట్రర్డ్‌ రిక్రూటింగ్‌ ఏజెంట్లే అక్రమ దందాకు తెరలేపారు. మన దేశంలో వీసా స్టాంపింగ్‌ చేయించుకుంటే రూ.6 వేలు మెడికల్‌ టెస్ట్‌ల కోసం, రూ.11వేలు యూఏఈ ఎంబసీకి ఫీజు చెల్లించాలి. ఎంబసీలో సకాలంలో పనికాకపోతే ఒకటి రెండు రోజులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఇందుకు మరికొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. లైసెన్స్‌డ్‌ ఏజెంట్లు కార్మికుల నుంచి వీసా కోసం రూ.60 వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో ఎంబసీలో స్టాంపింగ్‌ కోసం రూ.17వేలు, ఇతర ఖర్చులు పోను మిగిలిన దానిలో విమాన చార్జీలు, మధ్యవర్తులకు కమీషన్‌ చెల్లించడం వల్ల తమకు లాభం తగ్గిపోతుందని లైసెన్స్‌డ్‌ ఏజెంట్లు భావిస్తున్నారు. ఇక్కడ స్టాంపింగ్‌ చేయించడం కంటే విజిట్‌ వీసాపై యూఏఈ పంపిస్తే రూ.20వేల ఖర్చులో కార్మికుడు అక్కడకు చేరుకుంటున్నాడు. ఎలాగూ కంపెనీతో ఏజెంట్లు ముందుగా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వర్క్‌ వీసా సులభంగానే లభిస్తుంది. అందువల్ల విజిట్‌ వీసాలపైనే కార్మికులను యూఏఈకి తరలించడానికి ఏజెంట్లు మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా విజిట్‌ వీసాలపై కార్మికులను యూఏఈకి తరస్తున్నారు. 

ప్రయోజనాలుపొందలేకపోతున్న కార్మికులు

విజిట్‌ వీసాపై యూఏఈ వెళ్లి వర్క్‌ వీసా పొందుతున్న కార్మికులు మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. విజిట్‌ వీసాపై వెళ్లిన వారి సమాచారం మన ప్రభుత్వం వద్ద ఉండే అవకాశం లేదు. ఇక్కడి నుంచి వర్క్‌ వీసాపై యూఏఈ వెళ్లిన వారికి రూ.10లక్షల ప్రవాసీ భారతీయ బీమా యోజన, ఇతర సదుపాయాలు అందుతాయి. కానీ, లైసెన్స్‌డ్‌ ఏజెంట్లు తమ లాభం పెంచుకోవడానికి అడ్డదారిలో కార్మికులను తరలిస్తుండటంతో వలస జీవులు ఎంతో నష్టపోతున్నారు.

పోలీసులు, విదేశాంగ శాఖ దృష్టిసారిస్తేనే..
యూఏఈకి అడ్డదారిలో కార్మికుల తరలింపుపై మన పోలీసులు, విదేశాంగ శాఖ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. విజిట్‌ వీసాలపై కార్మికులను తరలిస్తుండటాన్ని అడ్డుకుని ఇక్కడే వర్క్‌ వీసా జారీ చేయించి వలస వెళ్లేలా విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాల్సి ఉంది. కార్మికుల ప్రయోజనాలను కాపాడాలన్నా, మన ప్రభుత్వం వద్ద వలస కార్మికుల వివరాలు ఉండాలన్నా.. చట్ట బద్దంగా ఇక్కడి నుంచి వర్క్‌ వీసాలపై యూఏఈ వెళ్లడానికి విదేశాంగ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

యూఏఈలో ఉపాధి కోసం రెండు రకాల వీసాలు..
యూఏఈలో పని కల్పించడానికి రెండు రకాల వీసాలను జారీచేస్తున్నారు. మన దేశం నుంచి యూఏఈ వెళ్లాలనుకునేవారికి సౌదీ అరేబియా తరహాలో పాస్‌పోర్టుపై మన దేశంలోనే యూఏఈ రాయబార కార్యాలయంలో వీసా స్టాంపింగ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, అబుదాబి, షార్జా, దుబాయిలలోనే కొన్ని ఎంపిక చేసిన కంపెనీల్లో ఉపాధి కోసం పాస్‌పోర్టులో వీసా స్టాంపింగ్‌ చేయిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ లేదా కేరళలోని తిరువనంతపురం యూఏఈ రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపింగ్‌ చేయించుకోవాల్సి ఉంది. వీసా పొందిన వారికి మన దేశంలోనే మెడికల్‌ టెస్టులను చేస్తారు. రెండో రకం వర్క్‌ వీసాలను పేపర్‌ ప్రింటింగ్‌ ద్వారానే జారీచేస్తున్నారు. ఈ వీసాలు పొందిన వారు యూఏఈ వెళ్లిన తరువాత ‘గమ్‌కా’ మెడికల్‌ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.

విజిట్‌ వీసాపై వెళ్లి నెల రోజులు ఉండివచ్చా..
వర్క్‌ వీసాను దుబాయిలో తీసుకోవచ్చనే ఉద్దేశంతో విజిట్‌ వీసాపై గత నెలలో వెళ్లాను. కానీ, అక్కడ సరైన పని దొరకలేదు. దీంతో నెల రోజుల పాటు ఉండి వర్క్‌ వీసాల కోసం ఎంతో ప్రయత్నించాం. ఆశించిన పని, వేతనం లేక పోవడంతో తిరిగి ఇంటికి వచ్చా. ఇక్కడే చిన్న కిరాణ దుకాణం నడుపు కుంటున్నా. – పెండెం మోహన్, వడ్యాట్‌(నిజామాబాద్‌ జిల్లా)

 
ఇక్కడే వర్క్‌ వీసా పొందాలి..
మా గ్రామానికి చెందిన వ్యక్తి దుబాయిలో ఉన్నాడు. వర్క్‌ వీసా ఇప్పిస్తానంటే.. నాతో పాటు మరో వ్యక్తి కలిసి నెల రోజుల కిందట విజిట్‌ వీసాపై వెళ్లాం. కానీ, పని దొరకకపోవడంతో అక్కడి నుంచి తిరిగి వచ్చాం. విజిట్‌ వీసాలపై వెళ్లి వర్క్‌ వీసా తీసుకోవాలనుకోవడం పొరపాటే. ఆర్థికంగా నష్టపోయాం. – విప్పులాయి నవీన్, వడ్యాట్‌(నిజామాబాద్‌ జిల్లా)
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top