కోరిక తీరిస్తేనే.. పాస్‌బుక్కు, చెక్కు

Women Farmer complaint to Human Rights Commission against Tahasildar - Sakshi

మహిళా రైతుతో తహసీల్దార్‌ బేరసారాలు?

హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన బాధితురాలు

కలెక్టర్‌కు నోటీసుల జారీ

సాక్షి, గద్వాల: ‘నా కోరిక తీర్చు.. అప్పుడే రైతు బంధు చెక్కు, పాస్‌బుక్కు ఇస్తా’అంటూ తహసీల్దార్‌ తనను వేధిస్తున్నారని జోగు ళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్‌పై అదే మండలం చిన్నిపాడు గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు హెచ్‌ఆర్‌సీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. స్థానికంగా ఫిర్యాదు చేస్తే అధికారులు తహసీల్దార్‌కే వత్తాసు పలుకుతారన్న ఉద్దేశంతో వారం క్రితం తాను హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించినట్లు బాధితురాలు వెల్లడించింది.

పాసుబుక్కు, రైతుబంధు చెక్కు ఇవ్వ కుండా రోజుల తరబడి కార్యాలయానికి తిప్పించుకుంటున్నారని ఆమె వాపోయింది. తనకు అన్యాయం చేయాలని కుట్ర చేశారని.. తన కోరిక తీరిస్తేనే చెక్కు ఇస్తానంటూ వేధిస్తున్నారని తెలిపింది. కాగా, దీనిపై మానవపాడు తహసీల్దార్‌ మునెప్ప విలేకరులతో మాట్లాడుతూ తాను ఎవరి విషయంలో కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.

చిన్నిపాడులో సర్వే నంబర్‌ 57/ఏలో 1.06 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తిగా ఉన్నప్పటికీ గతంలో సంబంధిత రెవెన్యూ యంత్రాంగం ఒక్కరిపైనే పట్టా చేసిందన్నారు. చెక్కు పంపిణీ సమయంలో మిగతా వాటాదారుల ఫిర్యాదు మేరకు, వివాదంలో ఉన్నందున చెక్కు ఆపామన్నారు. ఈ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top