దేశరక్షణ కోసం బీజేపీని గెలిపించాలి

To Win the BJP for National Security Says Sushma Swaraj - Sakshi

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ 

హైదరాబాద్‌ : దేశరక్షణ, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీని గెలిపించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ సికింద్రాబాద్‌లోని హర్యానాభవన్‌లో బీజేపీ లింగ్విస్టిక్‌ మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో బాంబు పేలుళ్లతో దేశం అల్లకల్లోలమైందని, ముంబైలో జరిగిన ఉగ్రదాడికి సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి చేసిన కొద్ది రోజుల్లోనే దానికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేశామని చెప్పారు.

సర్జికల్‌ స్ట్రైక్‌ చేసిన తర్వాత 17 దేశాల అధినేతలు మద్దతు ప్రకటించారని, పాకిస్తాన్‌ను ఏకాకిని చేశామని చెప్పారు. ఉగ్రవాదం కంటే నిరుద్యోగమే పెద్ద సమస్య అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, కానీ ఉగ్రవాదం లేకుంటేనే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించగలరని అన్నారు. ఉగ్రవాదం సమస్య కాకపోతే రాహుల్‌ ఎస్పీజీ రక్షణతో ఎందుకు బయటకు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రతివ్యక్తి అభివృద్ధే దేశాభివృద్ధిగా భావించి మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. సంక్షేమ పథకాల డబ్బు మొత్తం నేరుగా ఇప్పుడు లబ్ధిదారులకు చేరుతుండటం హర్షించదగ్గ విషయమన్నారు.  

కళ్లకు గంతలు తీసి చూడాలి... 
ఆయుష్మాన్‌భారత్‌ పథకం ద్వారా దేశంలోని 50 కోట్ల మంది ఏడాది రూ.5 లక్షల మేరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. యువత ఉపాధి కోసం రూ.800 కోట్ల ముద్ర రుణాలు అందించామని తెలిపారు. మోదీ ఏమి చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారని, కళ్లకు గంతలు తీసి చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. నిద్రపోయే వారిని లేపవచ్చని, నిద్ర నటించేవారిని లేపడం కష్టమని విమర్శించారు. గతంలో బండారు దత్తాత్రేయను నాలుగుసార్లు ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్‌ ప్రజలు ఈసారి కిషన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని, లోక్‌సభ ఎన్నికలు దేశానికి సంబంధించినవి కావడంతో ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో సర్కారు చెప్పే మాటలు కాకుండా ఉగ్రవాది మసూద్‌ అజార్‌ చెప్పే మాటలనే కాంగ్రెస్‌ విశ్వసిస్తోందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 15 ఏళ్లపాటు అసెంబ్లీలో ప్రజాగళం విప్పిన తనకు ఎంపీగా పార్లమెంటులో గళం విప్పే అవకాశం కల్పించాలని విన్నవించారు. టీఆర్‌ఎస్‌ ప్రాంతీయ పార్టీ మాత్రమేనని, ఆ పార్టీకి ఓటు వేయడం వల్ల ఒరిగేది ఏమి లేదని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top