పెరిగిన పోలింగ్‌ ఎవరికి లాభం?

To Whom They Dare To Win Surprising On Results By Constituencies - Sakshi

పెరిగిన పోలింగ్‌ శాతంపై మల్లగుల్లాలు

పురుషులతో పోటీగా మహిళల ఓటింగ్‌

అనుకూల, ప్రతికూలతలపై తేలని లెక్క

ఎవరికి వారు గెలుపుపై ధీమా

నియోజకవర్గాల వారీగా ఫలితాలపై ఉత్కంఠ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో వెలువడనుండగా, గెలుపోటములపై అభ్యర్థుల లెక్కలు మాత్రం తేలడం లేదు. గత ఎన్నికలతో పోలిస్తే 8.1శాతం మేర పోలింగ్‌ శాతం పెరగడం ఎవరికి అనుకూలిస్తుందోననే కోణంలో రెండు రోజులుగా అభ్యర్థులు ఎడతెగని కసరత్తు చేస్తున్నారు. పురుషులతో పోటీగా మహిళలు ఓటింగ్‌లో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం ఎక్కువగా ఉండడాన్ని ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ, గెలుపోటములపై అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి :  శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 81.94శాతం పోలింగ్‌ నమోదైంది. 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 8.1శాతం ఓట్లు అదనంగా పోలయ్యాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం గణనీయంగా పెరగ్గా అందోలు నియోజకవర్గం పరిధిలో ఈ పెరుగుదల ఏకంగా 10.19శాతంగా నమోదు కావడం గమనార్హం. శుక్రవారం సాయంత్రం పోలింగ్‌ గడువు ముగిసిన మరుక్షణం నుంచే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు బూత్‌ల వారీ ఓట్ల వివరాలు సేకరించారు. బూత్‌ స్థాయిలో తమకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉండే ఓట్ల సంఖ్యపై అభ్యర్థులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.

అయినా సంతృప్తి చెందని అభ్యర్థులు తమ నియోజకవర్గం పరిధిలో ఓ వైపు వివిధ వర్గాల నుంచి ఓటింగ్‌ సరళిపై వివరాలు సేకరిస్తూనే, విభిన్న కోణాల్లో పోలింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా పోలింగ్‌కు సంబంధిం చిన మూడు అంశాలు పార్టీలు, అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరగడం, పురుష ఓటర్లకు దీటుగా మహిళలు పోలింగ్‌లో పాల్గొనడం, గ్రామీణ బూత్‌లలో పెరిగిన పోలింగ్‌ శాతంపై అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మూడు అంశాలు తమ ఫలితాన్ని ఎంత మేర ప్రభావితం చేస్తాయనే అంశంపై లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో పాటు పోలింగ్‌ బూత్‌

స్థాయిలో మద్యం, డబ్బు పంపిణీ ఎంత మేర ప్రభావం చూపుతుందనే కోణంలోనూ ఆయా పార్టీల నేతలు అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత ఎంత?

మహా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస తరఫున పోటీ చేసిన అభ్యర్థులు.. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పనిచేసిందని లెక్కలు వేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల వ్యక్తిగత పనితీరు తమకు భారీగా లాభిస్తుందనే అంచనాలో కూటమి అభ్యర్థులు కనిపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాలు, తెలంగాణవాదం, చేసిన పనితీరు, ప్రచారంలో సమన్వయం, భారీ బహిరంగ సభలు తమకు కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు.

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నడుమ త్రిముఖ పోటీ జరిగినట్లు పోలింగ్‌ సరళి వెల్లడిస్తోంది. కొన్ని బూత్‌లలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, మరికొన్ని చోట్ల టీఆర్‌ఎస్, బీజేపీ నడుమ పోరుగా కనిపించింది. సుమారు 15వేల ఓటు బ్యాంకు కలిగిన టీడీపీ మహా కూటమిలో భాగస్వామిగా ఉండడంతో, ఓటు బదిలీ ఎంత మేర జరిగిందనే అంశంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల రాజకీయ మనుగడకు ఎన్నికల ఫలితాలు గీటురాయి కానున్నాయి.

అందోలు నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక పోలింగ్‌ శాతం నమోదు కావడం, గత ఎన్నికలతో పోలిస్తే 10.19శాతం అదనంగా ఓట్లు పోలవడం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ పోటీ చేసినా బూత్‌ స్థాయిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నడుమ నువ్వా నేనా అనే రీతిలో పోలింగ్‌ నడిచింది. మహిళా ఓటర్లు ఇక్కడ ఫలితాన్ని నిర్దేశించే సూచనలు కనిపిస్తున్నాయి. 

జహీరాబాద్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నడుమ ప్రధానంగా పోటీ సాగినా, బీజేపీ అభ్యర్థి గణనీయమైన ఓట్లు సాధించే పరిస్థితి కనిపిస్తోంది. ఝరాసంగం మినహా ఇతర మండలాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల నడుమ పోటీ కేంద్రీకృతమైనట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మొగ్గు చూపిన యువత ఈసారి బీజేపీ వైపు మళ్లినట్లు కనిపిస్తుండడం, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిపై అభ్యర్థులు ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటున్నా, గ్రామీణ బూత్‌లలో ఓటింగ్‌ శాతం పెరగడంతో టీఆర్‌ఎస్‌లో ధీమా కనిపిస్తోంది. సంగారెడ్డి పట్టణ ఓటర్ల నాడి అంతుబట్టక పోవడం కొంత ఉత్కంఠ రేపుతున్నా, మైనారిటీ ఓటర్లు ఎటు మొగ్గు చూపి ఉంటారనే అంశం కీలకంగా మారింది. క్రిస్టియన్‌ మైనారిటీ ఓట్లు ఓ పార్టీకి అనుకూలంగా పోలవుతాయని భావించినా, ఆ మేరకు పడినట్లు కనిపించడం లేదు.

పటాన్‌చెరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రచార హడావుడి సృష్టించినా, చివరి నిమిషంలో టికెట్‌ ఖరారు కావడంతో పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నడుమ కేంద్రీకృతమైంది. రామచంద్రాపురం, అమీన్‌పూర్‌ మండలాలు, పటాన్‌చెరు పట్టణ బూత్‌లతో ఇరు పార్టీల నడుమ గట్టి పోటీ కనిపించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top