
లెక్కలేవి సార్...!
సాధారణ ఎన్నికలు ముగిసి నెలన్నర కావస్తున్నా పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు చూపడం లేదు. లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు అరకొర వివరా లు సమర్పించారు.
సార్వత్రిక సమరం ముగిసింది. ఫలితాలూ వచ్చి గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. వారిలో అమాత్యులయ్యేందుకూ యత్నిస్తున్నారు. ఇలా అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతా ఓకే..అని మురిసిపోతున్నా..వారు అసలు గుట్టు విప్పడం లేదు. ఎన్నికల వేళ వ్యయపరిచిన మొత్తాలకు లెక్కలేవి సార్..అంటే మొహం చాటేస్తున్నారు. కొందరు మమ అనిపించినా అధికులు చూద్దామంటూ దాటవేత వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దీన్ని తేల్చేందుకే ఇప్పుడు వ్యయ పరిశీలకులు జిల్లాకు వస్తున్నారు.ఖర్చుల కథ తేల్చనున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికలు ముగిసి నెలన్నర కావస్తున్నా పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు చూపడం లేదు. లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు అరకొర వివరా లు సమర్పించారు. అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా రిటర్నింగ్ అధికారులకు వివరాలు ఇవ్వలేదు. దీంతో అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని తేల్చేం దుకు ఎన్నికల కమిషన్ నియమించిన వ్యయ పరిశీలకులు జిల్లాలో మూడు రోజుల పాటు వివరాలు సేకరించనున్నారు.
ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు 15 మంది, 14 అసెంబ్లీ స్థా నాలకు 123 అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల సందర్భంగా నిబంధనల మేరకు రోజూవారి ఎన్నికల వ్య యాన్ని అభ్యర్థులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
ఎన్నికలు ముగిసి ఫలితం తేలినా అభ్యర్థులు మాత్రం ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించడంలో మీన మేషాలు లెక్కిస్తున్నారు. నిబంధనల ప్రకారం లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి రూ.70లక్షలు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా రూ.28 లక్షల వరకు వ్యయం చేసే వీలుంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన తొమ్మిది మందిలో బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి మినహా మిగతా అభ్యర్థులు వ్యయ వివరాలు సమర్పించారు. లెక్కలు సమర్పించిన వారు పూర్తి వివరాలు ఇంకా అందజేయాల్సి వుంది. నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరుగురు పోటీ చేయగా ఒక్కరూ నేటికీ పూర్తి వివరాలు సమర్పించిన దాఖలా లేదు. మహబూబ్‌న గర్ లోక్‌సభకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏపీ జితేందర్‌రెడ్డి రూ.43.16లక్షలు ఖర్చు చూపారు. కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్‌రెడ్డి రూ.33.50లక్షలు, స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ రూ.47వేలు, ఇబ్రహీం రూ.7.99లక్షలు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రహమాన్ 2.31 లక్షలు ప్రచార వ్యయం చేసినట్లు లెక్కలు చూపారు. అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు లెక్కలు సమర్పించినందున తమ వద్ద వివరాలు లేవంటూ కలెక్టరేట్ అధికారులు చెప్తున్నారు. కాగా ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో పాటు, డిపాజిట్ దక్కించుకున్న అభ్యర్థులు తమ డిపాజిట్ సొమ్ము వాపస్ చేయాల్సిందిగా లేఖ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎన్నికల లెక్కలు సమర్పిస్తేనే డిపాజిట్ తిరిగి ఇస్తామనే షరతు అధికారులు విధిస్తున్నారు.
నేడు జిల్లాకు వ్యయ పరిశీలకులు
సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ వివరాలు సరిచూసేందుకు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. నలుగురు ఐఆర్‌ఎస్ అధికారులు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు అభ్యర్థుల వారీగా వ్యయ వివరాలు సేకరించనున్నారు.
వీరికి సహకరించేందుకు జిల్లా యంత్రాంగం స్థానిక అధికారులను సంధానకర్తలుగా నియమించింది. ఐఆర్‌ఎస్ అధికారి శంకర్ మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానంతో పాటు మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గ అభ్యర్థుల వ్యయ వివరాలు పరిశీలిస్తారు. మరో ఐఆర్‌ఎస్ అధికారి బి.ప్రధాన్ కొడంగల్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల అభ్యర్థులు వ్యయ వివరాలు సేకరిస్తారు.
పి.మోహన్ గోపు నాగర్‌కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు అభ్యర్థుల నుంచి, భట్టాచార్జి సుమిత్ర వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, ఆలంపూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలిస్తారు. సకాలంలో ఎన్నికల వ్యయాన్ని సమర్పించిన అభ్యర్థులకు ఇప్పటికే పలుమార్లు జిల్లా అధికారులు లేఖలు రాశారు. ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించని అభ్యర్థులపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలుంటాయని అధికారులు వెల్లడించారు.