వరంగల్‌ స్టేషన్‌: గాంధీజీ నడియాడిన నేల

Warangal Railway Station Has Footprints Of Mahatma Gandhi - Sakshi

స్వాతంత్య్రం వచ్చాక బాపూజీ యూత్‌ భవన నిర్మాణం

నాడు వ్యాయామశాల.. నేడు యూత్‌ భవనం

ఏటా ఘనంగా జయంతి వేడుకలు

సాక్షి, వరంగల్‌: అది మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ నడియాడిన నేల. బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేసిన జాతిపిత గాంధీ వచ్చిన ఆ స్థలంలో స్వాతంత్య్రం వచ్చాక స్థానికులు బాపూజీ యూత్‌ అసోసియేషన్‌ పేరిట భవనాన్ని నిర్మించారు. వ్యాయమశాలగా అప్పట్లో యువకులు ఉపయోగించుకోగా.. ఇప్పుడు యూత్‌ భవనంగా పలు కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమం సాగుతున్న సమయంలో గాంధీజీ మద్రాస్‌ నుంచి రైలులో వార్థాకు వెళ్తున్నారు. ఎలాగైనా గాంధీజీని వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ఆపి.. బహిరంగ సభలో మాట్లాడించాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమరయోధుడు భండారు చంద్రమౌళీశ్వర్‌ రావు అభ్యర్థన మేరకు గాంధీజీ 1946 ఫిబ్రవరి 5న వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో ఆగారు. ప్రస్తుతం బాపూజీ యూత్‌ భవనం నిర్మించిన స్థలానికి వచ్చి మాట్లాడాక ఆజంజాహి మిల్లు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత స్వాతంత్య్రం రావడంతో స్టేషన్‌ రోడ్డులోని స్థలంలో గూడూరు చెన్న స్వామి, తాళ్ల గురుపాదం, నర్సింగరావు, ముత్యాలు తదితరులు బాపూజీ యూత్‌ పేరిట భవనాన్ని నిర్మించి బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరడంతో పదిహేనేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, కార్పొరేటర్‌ జారతి రమేష్‌ నిధులు కేటాయించగా రెండంతస్తుల భవనం నిర్మాణమైంది. ఈ మేరకు యూత్‌లో సుమారు 20 మంది వరకు సభ్యులు ఉండగా ఏటా గాంధీ జయంతి, వర్ధంతి స్వాతంత్య్ర దినోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తాం
మా కాలనీ పెద్దలు బాపూజీ పేరిట భవనాన్ని నిర్మించారు. బాల్యదశలో ఇక్కడ వ్యాయామం చేసేవాళ్లం. కొన్ని దశాబ్దాలుగా గాంధీ జయంతి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్నాం. వినాయక ప్రతిమను ప్రతిష్ఠిస్తున్నాం. వివిధ కార్యక్రమాలకు భవనం ఎంతగానో ఉపయోగపడుతోంది. 
– గూడూరు సత్యానంద్, బాపూజీ యూత్‌ సభ్యుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top