రాష్ట్రంలో ఓటర్లు.. 2,61,36,776

Voters Draft List Is Released And New Enrollment Is Started For 2018 Telangana Elections - Sakshi

ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

9,45,955 మంది కొత్త ఓటర్లు

1,36,964 మంది ఓటర్ల తొలగింపు

కొత్త ఓటర్ల నమోదుకు ఇంకా చాన్స్‌

25 వరకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ

వచ్చే నెల 8న తుది జాబితా ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో 2,61,36,776 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,32,67,626 మంది పురుషులు, 1,28,66,712 మంది మహిళలు, 2,438 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. స్త్రీ, పురుష ఓటర్ల సంఖ్య మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మేరకు 2018కి సంబంధించిన రెండో ఓటర్ల జాబితా సవరణ ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సోమవారం ప్రకటించింది. 2018, జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా తొలి సవరణ ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,53,27,785 కాగా, అనంతర కాలంలో 9,45,955 మంది కొత్త ఓటర్లకు చోటు కల్పించడంతో పాటు వివిధ కారణాలతో 1,36,964 మంది ఓటర్లను తొలగించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,61,36,776 మందికి చేరుకుంది.

రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఈసీ ప్రత్యేకంగా రెండో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ ప్రకారం.. కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణతో పాటు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 10 నుంచి ఈ నెల 25 వరకు స్వీకరిస్తారు. వచ్చే నెల 4లోగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 8న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2018, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  

కొత్త యువ ఓటర్లు 2 లక్షలు...
తాజాగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 18–19 ఏళ్ల మధ్య వయసున్న 2,20,674 మంది కొత్త యువ ఓటర్లు త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,34,329 మంది పురుషులు, 86,313 మంది మహిళలు, 32 మంది ఇతరులున్నారు. 19 ఏళ్లకు పైబడిన మొత్తం ఓటర్లు 2,59,16,102 మంది.. కాగా అందులో 1,31,33,397 మంది పురుషులు, 1,27,80,399 మంది మహిళలు, 2,406 మంది ఇతరులున్నారు.  

హైదరాబాద్‌ టాప్‌.. వనపర్తి లాస్ట్‌
రాష్ట్రంలో అత్యధికంగా 38,61,009 మంది ఓటర్లు హైదరాబాద్‌ జిల్లాలో ఉండగా, అ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 26,56,013 మంది, మేడ్చెల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 19,87,270 మంది ఓటర్లు, నల్లగొండ జిల్లాలో 12,23,554 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 2,09,340 మంది ఓటర్లు ఉండగా, ఆ తర్వాత ఆదిలాబాద్‌ జిల్లాలో 3,52,666 మంది, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 3,55,907 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,66,701 మంది ఓటర్లున్నారు.  


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top