
సాక్షి, సిటీబ్యూరో: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 22న తుది ఓటరు లిస్టు ప్రకటిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ తెలిపారు. ఆదివారం గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు అర్హులని, 11వ తేదీ లోపు తమకు వచ్చిన దరఖాస్తులపై ఎంక్వయిరీ పూర్తిచేస్తామన్నారు. ఈ నెల 4వ తేదీ నాటికి 1,74,966 ఫామ్–6 దరఖాస్తులు, ఫామ్6ఏ 487, ఫామ్7..42,479, ఫామ్–8..35,982, ఫామ్ 8ఏ.. 59,132 కలిపి మొత్తం 3,13,426 దరఖాస్తులు వచ్చాయన్నారు. విచారణ పూర్తితో ఇప్పటి వరకు 1.47 వేల కొత్త ఓటర్లు చేరారన్నారు. మొత్తం మీద 28,500లకు పై ఓట్లను తొలగించినట్లు చెప్పారు. సోమవారం నుంచి ఈవీఎంలకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఉంటుందన్నారు. ఇందు కోసం ముగ్గుర్ని నోడల్ అధికారులుగా నియమించామని, సమగ్రంగా ఓటరు జాబితాను తయారు చేయడానికి గతంలో డిలీట్ చేసిన వారిని కూడా పరిశీలించి జాబితా రూపొందిస్తున్నట్లు చెప్పారు. నాంపల్లిలో ఓటర్ల జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యం వహించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకునట్లు వివరించారు.