అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి కసరత్తు | Video Conference With Krishna And Godavari Board Chairman On Working Manual | Sakshi
Sakshi News home page

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి కసరత్తు

Jun 9 2020 4:43 AM | Updated on Jun 9 2020 4:43 AM

Video Conference With Krishna And Godavari Board Chairman On Working Manual - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివాదంపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సిద్ధమయ్యారు. ఇదే అంశంపై సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ ఆర్కే జైన్‌ తదితరులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 4న కృష్ణా బోర్డు, 5న గోదావరి బోర్డు సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి షెకావత్‌కు సీడబ్ల్యూసీ అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్‌లు సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదిక పంపినట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి లేని ప్రాజెక్టులను కొత్తగా ప్రాజెక్టులుగా పరిగణించాలని సీడబ్ల్యూసీ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఈనెల 10లోగా ఇవ్వాలని ఆదేశించినట్లు బోర్డుల చైర్మన్లు నివేదికలో పేర్కొన్నారని మంత్రికి సీడబ్ల్యూసీ అధికారులు వివరించారు.

ఇరు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇచ్చాక.. వాటిని పరిశీలించి నివేదిక ఇస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లతో చర్చించి.. అపెక్స్‌ కౌన్సిల్‌కు ఎజెండాను సిద్ధం చేయాలని సీడబ్ల్యూసీ అధికారులను కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌ ఆదేశించినట్లు సమాచారం. ఎజెండా సిద్ధమయ్యాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి.. వారి వీలును బట్టి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి షెకావత్‌ నిర్ణయించినట్లు సీడబ్ల్యూసీ అధికారవర్గాలు తెలిపాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లకుండా తాను జారీ చేసిన ఉత్తర్వులను ఇరు రాష్ట్రాలు అమలు చేసేలా చూడాలని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను మంత్రి షెకావత్‌ మరోసారి ఆదేశించినట్లు వెల్లడించాయి. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, వర్కింగ్‌ మాన్యువల్‌ ఆమోదం తదితర అంశాలపై మంగళవారం వాటి చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్‌ అయ్యర్‌ తదితరులతో మంత్రి షెకావత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement