కేటీఆర్‌ చొరవతో వైకల్యంపై విజయం

Victory over disability with KTR initiative - Sakshi

పోలియో బాధితుడికి చికిత్సలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చొరవ 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చొరవతో 4వతరగతి చదువుతున్న అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిరాం అనే బాలుడు అందరిలాగా నడిచే స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని కేటీఆర్‌ ట్విటర్‌లో వెల్లడిస్తూ.. ‘సీఎంఆర్‌ఎఫ్‌ సాయంతో పలు శస్త్రచికిత్సల అనంతరం సాయిరాం సాధారణ స్థితికి చేరుకోవడం ఆనందంగా ఉంది’అని పేర్కొన్నారు. గోదావరిఖనికి చెంది న సాయిరాం అనే బాలుడికి పోలియో వల్ల బాల్యంలోనే రెండు కాళ్లు వంకరగా మారి.. నడవలేని స్థితికి చేరుకున్నాడు.

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి బాలుడు సాయిరాం  ఈ ఏడాది జనవరిలో కేటీఆర్‌ను కలిసి, సాయం కోరారు. సాయిరాంకు  వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌కు అప్పగించారు. దీంతోపాటు సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా అవసరమైన ఆర్థిక సాయా న్ని బాలుడి కుటుంబానికి అందజేశారు. నగరం లోని ప్రముఖ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సల అనంతరం .. సాయిరాం ప్రస్తుతం సొంతగా నడవగలిగే స్థితికి చేరుకున్నాడు. చికిత్సల ద్వారా పూర్తిగా కోలుకున్న సాయిరాం తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం టీఆర్‌ఎస్‌ వర్కిగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను.. ఆయన బంజారాహిల్స్‌ నివాసంలో కలుసుకున్నారు. సాయిరాం సాధారణ స్థితికి చేరుకోవడంపై కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top