వాహన ‘విస్ఫోటం’!
మహానగరం రహదారులపై తిరిగే వాహనాల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది.
గ్రేటర్ లో భారీగా పెరిగిన వ్యక్తిగత వాహనాలు
కిలో మీటర్‌కు 723 వెహికిల్స్ ఉన్నట్లు అంచనా
ఇరుకు రోడ్లపై భారంగా మారిన ప్రయాణం
అడుగడుగునా ట్రాఫిక్ జామ్‌లు
{పజారవాణా వ్యవస్థ పటిష్టమైతేనే సమస్యకు పరిష్కారం
సిటీబ్యూరో: మహానగరం రహదారులపై తిరిగే వాహనాల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ప్రజా రవాణా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా వ్యక్తిగత వాహనాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. జనాభాతో పోటీ పడి వాహనాలు పెరుగుతున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో లేకపోవడం, మెట్రో రైలు ఇంకా అందుబాటులోకి రాకపోవడం వంటి కారణాలు వ్యక్తిగత వాహన విస్ఫోటానికి దారితీస్తున్నాయి. ఇరుకు రహదారులపైనే లక్షల వాహనాలు వచ్చి పడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరించకపోవడంతో వాహన వేగం కూడా బాగా తగ్గిపోయింది. సగటున గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయాల్సిన వాహనాలు ఇప్పుడు గరిష్టంగా 20 కిలోమీటర్లు మాత్రమే వెళ్లగలుగుతున్నాయి. మరోవైపు నగరంలో నివాస ప్రాంతాలు తగ్గి, వాణిజ్య ప్రాంతాలు పెరిగిపోవడం కూడా ట్రాఫిక్ విలయానికి కారణమవుతోంది. రెండు దశాబ్దాల క్రితం కేవలం కోఠి, సికింద్రాబాద్ ప్రాంతాలకే పరిమితమైన వ్యాపార కార్యకలాపాలు ప్రస్తుతం నగరమంతా విస్తరించాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు నుంచి ఇటు ఎల్‌బీనగర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాపార కూడలిగా మారింది.
దీంతో వాహనాల రాకపోకలు బాగా పెరిగాయి. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం తప్ప పెరుగుతున్న వాహనాలకు బ్రేకులు వేయడానికి మరో గత్యంతరం లేదు. ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వాహనాలు కొత్తగా వస్తున్నాయి. నిత్యం 600 కొత్త వాహనాలు నమోదవుతున్నట్టు రవాణా అధికారుల అంచనా. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 40 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. రోడ్లు మాత్రం 8 శాతమే ఉన్నాయి. 2015 నాటికి ఈ వాహనాలు 44 లక్షలు దాటవచ్చని అంచనా. చెన్నై నగరంలో ఒక కిలోమీటర్ పరిధిలో కేవలం 593 వాహనాలు ఉంటే హైదరాబాద్‌లో ఈ సంఖ్య 723.



