అభివృద్ధి అంటే.. ఏంటో చూపిస్తా

Vaddiraju Ravichandra Interview With Sakshi

సాక్షి, వరంగల్‌: ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో నాయకులు విఫలమవుతున్నారు. వారికి భిన్నంగా పాలన సాగిస్తా. వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని స్మార్ట్‌గా తీర్చిదిద్దమే నా లక్ష్యం’ అని ప్రజాకూటమి అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర అంటున్నారు. ఎన్నికల ప్రచారం.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఆయన బుధవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. 

రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.. ఎలా ఉంది?
రాజకీయాలు నాకు కొత్తేమి కాదు. పరోక్షంగా 30ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందిన నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ నేతలతో ప్రత్యక్ష అనుబంధం ఉంది. అందువల్ల పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను.

ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది?
ప్రచారానికి వెళ్లిన సమయంలో ప్రజల నుంచి స్పందన చూసి అశ్చర్యపోయాను. మేయర్‌ నరేందర్‌ పాలనపై వారికి ఉన్న అసంతృప్తితోనే నేను గెలుస్తానన్న ధీమా వచ్చింది. అభ్యర్థి ఎవరు అన్న విషయం కాకుండా ఎలాంటి వాడు అన్న అంశాన్నే చూస్తారు.

మీరు గెలిచిన తర్వాత కలవాలంటే ఖమ్మం వెళ్లాలనే ప్రచారం జరుగుతోంది కదా?
ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు కావాలనే ఈఅసత్యపు ప్రచారం చేస్తున్నారు. నేను పుట్టింది వరంగల్‌ జిల్లా ఇనుగుర్తి గ్రామంలో.. చదువు సైతం వరంగల్‌ నగరంలోనే సాగింది. దేశాయిపేటలోని సీకేఎం కాలేజీలో చదువుతుండగా చదువును మధ్యలో ఆపివేశాను. నేను వ్యాపారపరంగా ఖమ్మంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటాను. వ్యాపార సౌలభ్యం కోసం ఖమ్మంలో స్థిరపడ్డాను. వరంగల్, హన్మకొండలో ముగ్గురు సోదరులు, కుటుంబ సభ్యులంతా ఉంటున్నారు. 

రాజకీయాల్లోకి ఎందుకు రావాలకున్నారు.. ఏం చేస్తారు?
గ్రానైట్‌ వ్యాపారంలో ఉంటూనే సామాజిక, ఆధ్మాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. లాభాపేక్షతో కాకుండా వచ్చి న దానిలో కొంత సామాజిక, దైవ కార్యాలకు వినియోగించాలని అనుకున్నా. అందువల్లే ఆదివాసీ ల ఆరాధ్యదైవమైన సమ్మక్క–సారలమ్మ తల్లుల గద్దెల ప్రాంగణంలో గ్రానైట్‌ను వేయించాను. ఢిల్లీ పోలీస్‌ అకాడమీలో ఏర్పాటు చేయనున్న స్మారక స్థూపం కోసం అక్కడి అధికారుల అభ్యర్థన మేరకు 230 టన్నుల గ్రానైట్‌ ఏకరాయిని సరఫరా చేశా. 

అధికార పార్టీని ఎదుర్కోవడం కష్టంగా ఉందా..?
అదేం లేదు. గత ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. దీంతో ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట పెద్దగా స్పందన వస్తోంది. అధికార పార్టీ కావడంతో కొంత మంది భయపడి ప్రత్యక్షంగా ప్రచారంలోకి రావడం లేదు. అంతర్గతంగా ప్రచారంభారీగా సాగుతోం ది.  టికెట్‌ ఖరారు కావడంలో జరిగిన జాప్యం వల్ల ప్రచారం ఎక్కువ రోజులు చేయలేక పోయా ను. కొండా దంపతుల అండదండలు, కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ప్రజాబలం తనకు ఉంటే చాలు. అయినప్పటికీ ప్రభుత్వంతో పాటు మేయర్‌పై ఉన్న అసంతృప్తితో తప్పక గెలుస్తానన్న నమ్మకం ఉంది.

నగర అభివృద్ధిపై మీ కామెంట్‌?
గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా నరేందర్‌ పూర్తిగా వైఫల్యం చెందినట్లు భావిస్తున్నా.  గెలిచి మూడేళ్లు కావొస్తున్నా అనుకున్న విధంగా నగరాన్ని అభివృద్ధి చేయడలో ఆయన  ఫెయిలయ్యారు. కేంద్రం నుంచి అమృత్, హృదయ్, స్మార్ట్‌ సిటీల కింద, రాష్ట్రం నుంచి బడ్జెట్‌లో కేటాయించిన రూ.900కోట్లకు పైగా నిధులు వచ్చినా అందులో 10శాతం  ఖర్చు చేయలేకపోవడమే ఆయన పనితనానికి నిదర్శనం. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరో పదేళ్లు నియోజకవర్గ అభివద్ధి వెనక్కి పోయినట్లే. టీఆర్‌ఎస్‌ పార్టీలో పెద్ద నేతలున్నారు. మేయర్‌ పదవి ఉండగా ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకోవడం ఆయన అత్యాశకు నిదర్శనం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top