యురేనియం మోసాలమయం..

Uranium frauds in southern states - Sakshi

దక్షిణాది రాష్ట్రాల్లో యురేనియం, ఇరీడియం ముఠాలు

పిడుగు పడినప్పుడు దొరుకుతుందంటూ ఘరానా మోసం

విదేశీ మార్కెట్‌లో రూ. వందల కోట్లు ఉంటుందని బురిడీ

సాక్షి, హైదరాబాద్‌: చిట్టీలు వేసి మోసం చేసిన వాళ్లను చూశాం. ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకొని బోర్డు తిప్పేసిన కంపెనీలను చూశాం. చివరకు కరక్కాయల పేరుతో లక్షలు దండుకున్న గ్యాంగునూ చూశాం. కానీ మెరుపులు, ఉరుములు పడితే యురేనియం, ఇరీడియం తీసిస్తామన్న నయా గ్యాంగ్‌ను చూశారా? అవును రెండు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉరుములు, మెరుపులు పడినా ఆ ప్రాంతం నుంచి విలువైన యురేనియం, ఇరీడియం ఖనిజాలను తీసిస్తామంటూ గ్యాంగులు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరి మాటలు నమ్మి అమాయకులు రూ. కోట్లల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో మూడు నమోదయ్యాయి.

శాస్త్రవేత్తలు, పరీక్షలంటూ..
బెంగుళూరుకు చెందిన గంగాధర్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన కోహ్లీ బాబా ఇద్దరు ముఠాగా ఏర్పడ్డారు. కర్ణాటక, ఆం«ధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషాలోని పలువురు బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పదవీవిరమణ పొందిన ఉద్యోగులను టార్గెట్‌ చేసి ఇరీడియం, యురేనియం పేరుతో బురిడీ కొట్టించారు.

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రముఖ బిల్డర్, మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్‌ అధికారి ఇద్దరూ ఈ ముఠాను నమ్మి రూ. 4.5 కోట్లు పోగొట్టుకున్నారు. గంగాధర్‌రెడ్డి వీరితో పరిచయం పెంచుకొని బెంగుళూరు విమానాశ్రయ పరిధిలోని రసాయన కంపెనీలో యురేనియం నిలువ ఉందని, దాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ రక్షణ శాఖలో పని చేసే శాస్త్రవేత్త కోహ్లీ వస్తున్నాడని చెప్పి తీసుకెళ్లాడు.  

రూ. 4.5 కోట్లు టోకారా
ఓ గదిలోని రసాయన పదార్థాన్ని పరిశీలించేందుకు గాను ఆ బిల్డరు, రిటైర్డ్‌ ఉద్యోగికి ప్రత్యేక జాకెట్లు, హెల్మెట్‌ పెట్టి లోపలికి పంపాడు. ఆ రసాయనాన్ని పరీక్షిస్తున్నట్లు కోహ్లీ నటించడం, వెంటనే అందులో నుంచి పొగలు రావడం చూపించి ఇది నిజమైన ఇరీడియమని, దీన్ని జర్మన్‌లోని ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపాల్సి ఉంటుందన్నాడు.

దీన్ని నమ్మిన బిల్డర్, రిటైర్డ్‌ ఉద్యోగి చెరో రూ. 2 కోట్లు గంగాధర్‌కు ఇచ్చారు. వీరికి మధ్యవర్తిగా ఉంటూ హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌ ఉద్యోగిగా చెప్పుకుంటున్న మొయిన్‌ అనే వ్యక్తి రూ. 50 లక్షలు తీసుకొని మొహం చాటేశాడు. తీరా ఇదంతా ఫేక్‌ అని, అలాంటి ఖనిజాలు దేశంలో అరుదుగా ఉంటాయని.. దీనికి ప్రభుత్వాల అనుమతి తదితర వ్యవహారా లుంటాయని తెలుసుకొని వారు సీఐడీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన సీఐడీ గంగాధర్‌రెడ్డితో పాటు కోహ్లీని అరెస్టు చేసింది.  

విదేశాల్లో భారీ డిమాండ్‌ అంటూ..
10 కిలోల యురేనియం, ఇరీడియం విదేశీ మార్కెట్‌లో రూ. 100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు పలుకుతుందని బాధితులను ఈ గ్యాంగ్‌ నమ్మించింది. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా చూపించినట్లు తెలిసింది. టాలీవుడ్, శాండిల్‌వుడ్‌లోని ప్రముఖ హీరోలు, రాజకీయ నేతలు తమ ద్వారానే రూ. వందల కోట్లు దక్కించుకున్నారని నమ్మబలికింది. ఇందుకు పలువురు శాండిల్‌వుడ్‌ హీరోలతో దిగిన ఫోటోలను ఆధారాలుగా చూపించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాల్లో పిడుగు పడినపుడు తమ శాస్త్రవేత్తలు యురేనియాన్ని గుర్తించి ప్రముఖులకు సొమ్ము చేశారని చెప్పడంతో బాధితులు నమ్మి రూ. కోట్లు పోగొట్టుకున్నారు.  

ఒక్కరి నుంచే రూ.10 కోట్లు..
కొద్ది రోజుల క్రితమే విజయవాడకు చెందిన కొందరు.. హైదరాబాద్‌ చిక్కడపల్లిలో ఉండే రిటైర్డ్‌ ఉద్యోగి రామారావు (పేరు మార్చాము)ను ఇదేవిధంగా మోసం చేశారు. రెండున్నరేళ్లుగా రామారావును నమ్మించి ఆయన ఆస్తులన్నీ అమ్మిస్తూ ఖనిజ నిక్షే పాల పేరిట దండుకున్నట్టు రామారావు కుమారుడు నగర సీసీఎస్‌లో ఫిరా>్యదు చేశారు.

రంగంలోకి దిగిన సీసీఎస్‌ బృందం.. బ్లాక్‌ మ్యాజిక్‌ పేరుతో ఇరీడియం, యురేనియం దొరుకుతుందని, పలానా చోట దొరికిందని, దాన్ని పరీక్షించేందుకు జర్మన్‌ శాస్త్రవేత్తలు వస్తున్నారని చెప్పి రూ. కోట్లు దండుకుంటున్నట్లు వెలుగులోకి తీసుకొచ్చింది. రామారావు కేసులో విజయవాడకు చెందిన వ్యక్తిని, హైదరాబాద్‌ ముషీరాబాద్‌కు చెందిన మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించారు. వీరి వెనుకున్న గ్యాంగ్‌ ఏంటి? రెండు రాష్ట్రాల్లో ఎంత మందిని ఇలా మోసగించారో ఆరా తీస్తున్నారు. ఒక్క రామారావే రూ.10 కోట్ల వరకు నష్టపోయినట్లు గుర్తించారు.   

నమ్మొద్దు: సీఐడీ  
ఇరీడియం, యురేనియం, ఇతర ఖనిజాల వల్ల రూ. కోట్ల కొద్దీ డబ్బొస్తుందని నమ్మొద్దని, ఇలాంటి ముఠాలకు చెందిన సభ్యుల సమాచారం ఉంటే సీఐడీకి తెలపాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పిడుగు పడినట్లు అలాంటి ఖనిజాలేవి పడవని, అత్యాశకు పోయి ఆస్తులను పోగొట్టుకోవద్దని సూచించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top