కాంగ్రెస్‌లోనే ఉంటాం

Upendra Reddy made clear that the Congress did not leave - Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామన్న వార్తల్ని ఖండించిన ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌లో తాము చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఖండించారు. టీఆర్‌ఎస్‌లో చేరట్లేదని, చేరే ఉద్దేశం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. అరడజను మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోందంటూ శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చాలా మంది తమ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు పదేపదే వ్యాఖ్యానించడం, దానికి తగ్గట్టే కొందరి పేర్లు ప్రచారంలోకి రావడం తెలిసిందే. అయితే తాము ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడటం లేదని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, పోదెం వీరయ్య స్పష్టం చేశారు.

పంచాయతీ ఎన్నికల సమయంలో ఇలాంటి వార్తలు కేడర్‌ను అయోమయానికి గురి చేస్తాయని సబితారెడ్డి అన్నారు. తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ‘నేను మొదటి నుంచి కాంగ్రెస్‌వాదిని. 1986లో కార్పొరేటర్‌ అయిన నాటి నుంచి నేటి దాకా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నా. ఏ పరిస్థితుల్లోనూ నేను కాంగ్రెస్‌ను వీడను.. టీఆర్‌ఎస్‌లో చేరను’ అని ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెప్పారు. మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘నేను కాంగ్రెస్‌ను వీడను. ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మీడియా ముందు వెల్లడించాను. అయినా ఇంకా అలాంటి వార్తలే రావడం తీవ్ర బాధ కలిగించింది. అసలు ఇలాంటి ప్రచారం చేసేవారిని ఏమనాలో అర్థం కావట్లేదు’ అని పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను మొదటి నుంచీ కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్నానని, విలువలతో కూడిన రాజకీయాలే తనకు ప్రాణమని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top