నేడు హెచ్‌సీయూ బంద్‌

UoH Students call for bandh in universities today - Sakshi

అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ ముట్టడికి వర్సిటీ విద్యార్థి సంఘం పిలుపు

వార్డెన్‌ తాగొచ్చి అసభ్యంగా మాట్లాడారని ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌ :

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల సస్పెన్షన్‌పై మళ్లీ అగ్గి రాజుకుంది. విద్యార్థుల సస్పెన్షన్‌కి వ్యతిరేకంగా ఐదు రోజులుగా వివిధ రూపాల్లో నిరసనను వ్యక్తం చేసినా పట్టించుకోకపోవడంతో హెచ్‌సీయూ విద్యార్థి సంఘం మంగళవారం యూనివర్సిటీ బంద్, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. విద్యార్థుల సస్పెన్షన్‌కు యాజమాన్యం కక్షపూరిత వైఖరే కారణమని, దీనికి నిరసనగా విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులను బహిష్కరించాలని కోరింది. వైస్‌ చాన్స్‌లర్‌ అప్పారావు కక్షపూరిత వైఖరి విద్యార్థుల భవిష్యత్‌ను బలితీసుకుంటున్నదని ఆరోపించింది.

సోమవారం యూనివర్సిటీ మెయిన్‌ గేట్‌ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు, విద్యార్థులు మాట్లాడారు. వార్డెన్లు తాగి వచ్చి అనవసర రాద్ధాంతం చేయగా తమను సస్పెండ్‌ చేశారని విద్యార్థులు పేర్కొన్నారు. వార్డెన్లపై దాడి జరిగితే పోలీస్‌ కంప్లెయింట్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే బేషరతుగా సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విద్యార్థి సంఘం కార్యదర్శి ఆరిఫ్‌ అహ్మద్, నాయకులు బషీర్, భాస్కర్‌ డిమాండ్‌ చేశారు.

ఒకవేళ యూనివర్సిటీలో ఉన్న మగాళ్లందర్నీ మీ అమ్మాయిల హాస్టల్‌కి రానిస్తేనన్నా మీరు సంతృప్తి చెందుతారా’అంటూ ఓ వార్డెన్‌ నాతో అసభ్య ప్రేలాపన చేశారు. ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపే. దీనిని యాజమాన్యం నిలదీయకపోగా, రోహిత్‌ ఉద్యమంలో చురుకుగా ఉన్న 10 మంది విద్యార్థులను సస్పెండ్‌ చేసింది. – అథిర ఉన్ని, విద్యార్థిని

ప్రొక్టోరల్‌ కమిటీని ఎందుకు మినహాయించారు?
ఎటువంటి విచారణ లేకుండా సస్పెండ్‌చేయడంలో ఉద్దేశం విద్యార్థులను భయపెట్టడమే. రోహిత్‌ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారినే టార్గెట్‌ చేశారు. ప్రొక్టోరల్‌ కమిటీ క్యాంపస్‌లో ఉన్నతమైన కమిటీ, మరి దాన్నెందుకు విస్మరించారు. వీసీ అప్పారావు వైఖరికి టీడీపీ రాజకీయ అండదండలే కారణం. - మున్నా, అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

వార్డెన్లను దుర్భాషలాడింది ఎవరు?
పది మందిపై వేటు వేశారు. వారినెలా గుర్తించారో తెలియదు. వారిలో ఎవరెవరు ఏం నేరం చేశారని కానీ, ఏం జరిగిందని కానీ రిపోర్టు ఇవ్వలేదు. మరి కమిటీ ఎందుకు వేసినట్టు..? - వెంకటేష్‌ చౌహాన్, ట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌

ఇక్కడ ప్రశ్నించడమే నేరం..
ఆరోజు జరిగింది భౌతిక దాడి కాదు. కేవలం వాగ్వాదం. లైట్స్‌ ఆర్పి దాడికి దిగారనడం ఒఠ్ఠి అబద్ధం. తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇదంతా చేస్తున్నారు. రోహిత్‌ ఉద్యమంలో ఉన్నందుకే ఇదంతా. ఇక్కడ ప్రశ్నించడమే నేరమైంది. - సాయి యామర్తి, సస్పెండైన విద్యార్థి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top