ఆర్టీసీలో సంక్షేమ బోర్డులు

TSRTC Constitute Welfare Boards For Employees - Sakshi

 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు

ప్రతీ డిపో పరిధిలో కమిటీ నియామకాలు

భరోసా వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

గోదావరిఖనిటౌన్‌ (రామగుండం): ఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ సూచనల మేరకు బస్‌ డిపోలలో సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేశారు. సంక్షేమ బోర్డులో ఎంపిక చేసిన సభ్యులతో ప్రతీ వారం సమావేశం నిర్వహించి డిపో విధులు నిర్వహిస్తు ఉద్యోగులతో వారి సమస్యలపై సమావేశమవుతారు. సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవడం ఈ బోర్డల లక్ష్యం. డిపోకు ఐదుగురు సభ్యలను నియమిస్తారు. డిపో మేనజర్‌ ఈ కమిటీకి ముఖ్య అధికారిగా వ్యవహరిస్తారు. ఇద్దరు కార్మికులు, డిపో గ్యారేజీ ఇన్‌చార్జి, డిపో ట్రాఫిక్‌ ఇన్‌చార్జి ఇలా మోత్తం ఐదుగురు సభ్యులు ప్రతీవారం సమావేశమై డిపో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌ల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తారు.

సమావేశం ఇలా.....
ప్రస్తుతం ఆర్టీసీ డిపో నియమించిన సంక్షేమ కమిటీ అన్ని విషయాలలో కీలకంగా పని చేస్తుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించిన విషయాలకు ప్రధాన్యత ఉంటుంది. ఆర్టీసీ పని చేస్తున్న ఉద్యోగుల విధుల కేటాయింపు, జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సెలవులు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు. ఏమైన సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే సంస్థ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ఉద్యోగులకు  మరింత మేలు జరిగే విధంగా ఎలాంటి అంశాలనైన ఈ సమావేశంలో పొందుపర్చవచ్చు. వారానికోరోజు, నెలలో నాలుగు రోజు లు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. నెలకు ఒక్కసారి జిల్లా ఆర్‌ఎం కార్యాలయంలో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేస్తారు. రెండు నెలలకోసారి జోనల్‌ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్‌ స్థాయిలో మూడు నెలలకు ఒక్కసారి సమస్యలు పరిష్కరిస్తారు.

జిల్లాలో ఇలా...
జిల్లాలో గోదావరిఖని, మంథని బస్‌ డిపోలు ఉన్నాయి. గోదావరిఖని బస్‌ డిపోలో 129 బస్సు ఉండగా, 640 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మంథని డిపోలో 92 బస్సులు ఉండగా 310 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

గోదావరిఖని సంక్షేమ బోర్డు సభ్యులు..
1. ఎ.కొంరయ్య
2. బి.నారాయణ
3. వి.ఇందిరాదేవి
4. మాధవి
5. డీకే.స్వామి

మంథని సంక్షేమ బోర్డు సభ్యులు..
1. డీఆర్‌.రావు
2. విజయ్‌కుమార్‌

3. బేగం
4.పార్వతమ్మ
5. సడవలయ్య  

డిపోలలో ఫిర్యాదు బాక్సులు..
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం బస్‌ డిపోలో సూచనల కోసం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ప్రతీ ఉద్యోగి ఈ ఫిర్యాదు బాక్స్‌ను వినియోగించుకోవచ్చు. ప్రతీ కార్మికుని సెవులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్టీసీ సంస్థ కోసం సూచించే ప్రతి అంశాన్నీ ఈ ఫిర్యాదు బాక్స్‌లో వేయవచ్చు. వారంలో జరిగే సమావేశంలో ఈ బాక్స్‌ను తెరిచి ప్రతీ కార్మికుడి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం ఈ బాక్స్‌ లక్ష్యం. క్షేత్రస్థాయి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లాస్థాయిలో జరిగే సమావేశంలో ప్రతిబింబింపజేస్తారు.

మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు
సంక్షేమ బోర్డులో భాగంగా డిపోలలో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ల కోసం, మహిళ అధికారుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు, సౌకర్యలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రత్యేక అవసరాల కోసం ప్రత్యేక సౌకర్యాలను, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఉద్యోగుల సంక్షేమం కోసమే..
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కోసం ఆర్టీసీలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. దీని కోసం బస్‌ డిపోలో ఫిర్యాదు బాక్స్‌ ఏర్పాటు చేశాం. ప్రతీ ఉద్యోగి వారివారి సమస్యలను, సంస్థ అభివృద్ధి కోసం ఇచ్చే సూచనలు స్వీకరించి ప్రతీవారం పరిష్కరిస్తాం. దీంతో డిపోలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది.
– వెంకటేశ్వర్లు, గోదావరిఖని డిపో మేనేజర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top