
ఎక్సైజ్ శాఖ మెడపై ఐటీ కత్తి!
రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ మెడపై ఐటీ కత్తి వేళ్లాడుతోంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందేనని
* టీఎస్‌బీసీఎల్ ద్వారా వచ్చిన ఆదాయంపై గురి
* ఏపీలో బేవరేజెస్ కార్పొరేషన్ రద్దుతో ఐటీకి మినహాయింపు
* టీఎస్‌బీసీఎల్ కొనసాగింపుపై స్పష్టం కాని ప్రభుత్వ విధానం
* రూ. 400 కోట్లమేర పన్ను చెల్లించాల్సిన పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ మెడపై ఐటీ కత్తి వేళ్లాడుతోంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందేనని ఆదాయపు పన్ను శాఖ, రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
2012-13 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్(ఏపీబీసీఎల్) చేసిన మద్యం వ్యాపారానికి సంబంధించి ఆదాయం పన్ను కింద సుమారు రూ. 1,400 కోట్లు చెల్లించాలని గత ఫిబ్రవరి 28న ఐటీ శాఖ ఏపీ, తెలంగాణ బేవరేజే స్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం మార్చి 2 తర్వాత రెండు రాష్ట్రాల్లో కొన్ని మద్యం డిపోలను ఐటీ శాఖ సీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌బీసీఎల్‌ను కొత్తగా ఏర్పాటు చేశామని, ఏపీబీసీఎల్ బకాయిలతో తమకు సంబంధం లేదని కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం సాంకేతిక కారణాలతో గట్టెక్కింది.
అయితే 2014 జూన్ 2 నుంచి టీఎస్‌బీసీఎల్ పనిచేస్తున్నందున అప్పటి నుంచి మార్చి 2015 వరకు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను కోసం ఐటీ శాఖ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు చెపుతున్నాయి. కంపెనీ చట్టం ప్రకారం ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక కార్పొరేషన్ చేసే వ్యాపారం నుంచి ఆదాయపన్ను చెల్లించాల్సిందేనని ఇంతకు ముందే ఐటీ శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో సమస్యనుంచి బయటపడేందుకు ఎక్సైజ్ శాఖ తాజాగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ మద్యం ద్వారా రూ. 10వేల కోట్లు ఆర్జించింది.
ఇందులో వ్యాట్ రూపంలో రూ. 6వేల కోట్ల వరకు చెల్లించింది. ఖర్చులు పోగా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంపై ఐటీ శాఖ పన్ను విధిస్తే కనీసం రూ. 400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ వర్గాలు చెపుతున్నాయి. కాగా టీఎస్‌బీసీఎల్‌ను కొనసాగించాలా, ఏపీ ప్రభుత్వ తరహాలో రద్దు చేయాలా? తద్వారా వచ్చే లాభ నష్టాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను కోరినా, ఇప్పటి వరకు నివేదిక పంపలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సాంకేతికంగా ఐటీ మినహాయింపు పొందేందుకు గల అవకాశాలను ఆబ్కారీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.