ప్రతీ లావాదేవీపై ‘ఐ’టీ! | Explanation of Annual Information Report, ITR, Income Tax | Sakshi
Sakshi News home page

ప్రతీ లావాదేవీపై ‘ఐ’టీ!

Sep 1 2025 4:26 AM | Updated on Sep 1 2025 7:59 AM

Explanation of Annual Information Report, ITR, Income Tax

పెద్ద మొత్తంలో పెట్టుబడులు

భారీ నగదు జమలు

ప్రాపర్టీ లావాదేవీల సమాచారం 

ఎస్‌ఎఫ్‌టీ రూపంలో ఐటీ శాఖకు చేరతాయ్‌

ఐటీఆర్‌లో వెల్లడించకపోతే నోటీసులు 

పన్ను ఎగ్గొడితే భారీ జరిమానా, జైలు శిక్షలు 

ఏఐఎస్, ఫామ్‌ 26ఏఎస్‌ పరిశీలన తర్వాతే రిటర్నులు 

2024–25 ఏడాదికి రిటర్నుల గడువు తేదీ సెప్టెంబర్‌ 15

మల్టీ నేషనల్‌ బ్యాంక్‌ ఉద్యోగి ఒకరు తన ఆదాయపన్ను రిటర్నుల్లో వడ్డీ ఆదాయం కింద రూ.25,000 వచ్చినట్టు చూపించాడు. దీంతో ఆదాయపన్ను శాఖ మదింపు అధికారి (అసెసింగ్‌ ఆఫీసర్‌)కి సందేహం వచ్చి సంబంధిత ఐటీఆర్‌ను పరిశీలన కోసం తీసుకున్నారు. పన్ను చెల్లింపుదారు బ్యాంక్‌ లావాదేవీలను పరిశీలించగా, మరింత విలువైన సమాచారం లభించింది. దీంతో పెనాల్టీ విధించి, చెల్లించాలంటూ నోటీసు జారీ చేశారు. 

ఒక వ్యాపారి స్థలం విక్రయించగా లాభం వచ్చింది. ఐటీఆర్‌లో వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచాడు. ఎస్‌ఎఫ్‌టీ ద్వారా వచ్చిన సమాచారానికి, వ్యాపారి ఐటీఆర్‌లో వివరాలకు మధ్య తేడా ఉందని అసెసింగ్‌ ఆఫీసర్‌ గుర్తించారు. ఐటీఆర్‌ మదింపు అనంతరం, స్థలం విక్రయంపై మూలధన లాభాల పన్నుతోపాటు, పెనాల్టీ చెల్లించాలంటూ ఆదేశించారు. అంతేకాదు ఆదాయపన్ను చట్టం కింద చట్టపరమైన చర్యలు చేపట్టారు. 

ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడమే కాదు.. చట్టంలోని నిబంధనలను అనుసరించి అన్ని ఆర్థిక వివరాలనూ వెల్లడించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. చెప్పకపోతే పన్ను అధికారులకు తెలియదులే! అన్న నిర్లక్ష్యం పనికిరాదు. అన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల సమాచారం ఐటీ శాఖ గుప్పిట్లో ఉంటుంది. ఖరీదైన కొనుగోళ్లు, క్రెడిట్‌ కార్డు రుణాలు, ప్రాపర్టీ లావాదేవీలు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడుల సమాచారం ఆదాయపన్ను శాఖకు చేరుతుంది. ఏ చిన్న అంతరం ఉన్నా ఏఐ సాయంతో పన్ను అధికారులు సులభంగా గుర్తిస్తున్నారు. కనుక పన్ను చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడం కష్టమే..!  

అన్ని బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, తపాలా శాఖ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ తదితర రిపోర్టింగ్‌ ఎంటీటీలు (ఆర్‌ఈలు) ఆదాయపన్ను శాఖ వద్ద ‘స్పెసిఫైడ్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌’ను (ఎస్‌ఎఫ్‌టీ) ఏటా దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రతీ పాన్‌పై చేసిన నిర్దేశిత ఆర్థిక లావాదేవీల వివరాలను ఎస్‌ఎఫ్‌టీలో వెల్లడించాలి. పన్ను ఎగవేతలను నివారించేందుకు ఆదాయపన్ను శాఖ ఎస్‌ఎఫ్‌టీలను పరిశీలిస్తుంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలేనంటూ సెక్షన్‌ 87ఏ కింద రిబేటును వినియోగించుకుని ఎలాంటి పన్ను లేకుండా రిటర్నులు దాఖలు చేశాడని అనుకుందాం.

 కానీ, అదే వ్యక్తి రూ.5 లక్షలు విలువ చేసే బంగారం కొనుగోలు చేసి ఉంటే ఆదాయపన్ను శాఖ వద్దనున్న రికార్డులు ఆ విషయాన్ని లేవనెత్తుతాయి. దాంతో వారి ఐటీఆర్‌లు స్క్రూటినీ (పరిశీలన)కి వెళతాయి. తనకు ఆదాయం రూ.6 లక్షలుగానే చూపించొచ్చు. తీరా చూస్తే బ్యాంక్‌ నుంచి ఉపసంహరణలు లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి జీవన అవసరాలకు కావాల్సిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటివన్నీ ఆదాయపన్ను శాఖ అధికారులు సులభంగా పసిగట్టగలరు. కనుక ఎస్‌ఎఫ్‌టీ గురించి, ఏఐఎస్‌ గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.  

ప్రతి సమాచారం రికార్డు అవుతుంది.. 
స్పెసిఫైడ్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ (ఎస్‌ఎఫ్‌టీ) ద్వారా బ్యాంక్‌లు, మ్యూచువల్‌ ఫండ్స్, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, తదితర సంస్థలు అందించే సమాచారం.. పాన్‌ నంబర్‌ వారీగా వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లో నమోదవుతుంది. అన్ని ముఖ్య ఆర్థిక లావాదేవీల వివరాలు ప్రతీ పన్ను చెల్లింపుదారుడి ఏఐఎస్‌లో ఆటోమేటిక్‌గా రికార్డు అవుతాయని సింఘానియా అండ్‌ కో పార్ట్‌నర్‌ రికిత నయ్యర్‌ వెల్లడించారు.

 కనుక ఏఐఎస్‌ను ఒక్కసారి పరిశీలించుకున్న తర్వాత ఐటీఆర్‌ దాఖలు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల కచ్చితమైన సమాచారంతో ఐటీఆర్‌ నమోదు చేయడం సాధ్యపడుతుందని, తద్వారా ఐటీఆర్‌ వేగంగా ప్రాసెస్‌ అవుతుందని చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2024–25) పన్ను రిటర్నుల సమర్పణకు పొడిగించిన గడువు సెప్టెంబర్‌ 15వ తేదీతో ముగియనుంది.

ఐటీఆర్‌లో వెల్లడించకపోతే ఏమవుతుంది? 
‘‘పన్ను చెల్లింపుదారు ఆదాయపన్ను రిటర్నుల్లో (ఐటీఆర్‌) కీలక లావాదేవీల సమాచారాన్ని వెల్లడించనప్పుడు లేదా ఎస్‌ఎఫ్‌టీ, ఏఐఎస్‌లోని సమాచారంతో, ఐటీఆర్‌లోని వివరాలు సరిపోలనప్పుడు తదుపరి పలు పరిణామాలకు దారితీయవచ్చు’’ అని సంజోలి మహేశ్వరి తెలిపారు.  

నోటీసులు: ఏఐఎస్‌లో నమోదైన అధిక విలువ కలిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరణ కోరుతూ ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేస్తుంది. ఐటీఆర్‌లో వెల్లడించిన లావాదేవీలు సరిగ్గానే ఉన్నాయా? అంటూ ధ్రువీకరించాలని కోరుతుంది. పూర్తి వివరాలు వెల్లడించకపోవడం లేదంటే పాక్షిక వివరాలతో సరిపెట్టినట్టయితే సవరించిన ఐటీఆర్‌లు దాఖలు చేయాలని కోరుతుంది.   

పరిశీలన: ఐటీఆర్‌లో వెల్లడించిన ఆదాయానికి, ఎస్‌ఎఫ్‌టీలో లావాదేవీల సమాచారానికి మధ్య పొంతన లేనప్పుడు లేదా అసలు ఐటీఆర్‌ దాఖలు చేయనప్పుడు లేదంటే నోటీసుకు స్పందించనప్పుడు లేదా నోటీసుకు సరైన సమాధానం ఇవ్వనప్పుడు సంబంధిత పన్ను చెల్లింపుదారుడి ఐటీఆర్‌ను పూర్తి స్థాయి పరిశీలనను అసెసింగ్‌ ఆఫీసర్‌ చేపడతారు. నోటీసు జారీ చేసి సరైన సమాచారంతో రిటర్నులు దాఖలు చేయాలని పన్ను అధికారి కోరొచ్చు.  

పెనాల్టిలు: నిబంధనల ప్రకారం ఐటీఆర్‌లు దాఖలు చేయకపోవడం లేదా పన్ను చెల్లించనట్టయితే.. జరిమానాతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తారు. ఈ పెనాల్టీ అసలు పన్నుకు 50 శాతం నుంచి 200 శాతం వరకు ఉంటుంది. అంతేకాదు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తిస్తే జరిమానాకు అదనంగా జైలు శిక్ష కూడా పడుతుందని మహేశ్వరి తెలిపారు.

 ఎగవేసిన మొత్తం రూ.25 లక్షలకు పైన ఉంటే 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందని.. తప్పుడు వివరాలతో లేదా వివరాలను రహస్యంగా ఉంచి వెల్లడించని సందర్భాల్లో 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చని చెప్పారు. అయితే, నోటీసులకు సకాలంలో స్పందించి, వాస్తవ సమాచారంతో ఐటీఆర్‌లు దాఖలు చేసి, పన్ను చెల్లించడం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించొచ్చు.  

ఎస్‌ఎఫ్‌టీల్లోకి చేరే లావాదేవీలు.. 
→ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించిన విలువపై బ్యాంక్‌ డ్రాఫ్ట్‌లు/ పే ఆర్డర్లు / బ్యాంకర్‌ చెక్కులకు నగదు చెల్లింపులు.  
→ బ్యాంక్‌లు, కోపరేటివ్‌ బ్యాంకుల నుంచి ప్రీ–పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్లను రూ.10 లక్షలు అంతకుమించి నగదు చెల్లించి కొనుగోలు చేయడం.  
→ ఒక వ్యక్తి కరెంట్‌ ఖాతాలో నగదు జమలు రూ.50 లక్షలు అంతకుమించి చేసినప్పుడు.  
→ ఒక వ్యక్తి కరెంట్‌ ఖాతా నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలు, అంతకుమించి నగదు ఉపసంహరణలు. 
→ కరెంట్, టైమ్‌ డిపాజిట్‌ కాకుండా ఇతర బ్యాంక్‌ ఖాతాల్లో ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి నగదు జమ చేయడం. 
→ వస్తువు లేదా సేవా విక్రయంపై ఒక వ్యక్తి రూ.2 లక్షలకు మించి నగదు చెల్లించడం. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 44ఏఈబీ కిందకు ట్యాక్స్‌ ఆడిట్‌ అవసరమైన వారికే ఈ నిబంధన 
→ ఒకటి లేదా ఒకటికి మించిన క్రెడిట్‌ కార్డులకు ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపులు రూ.లక్ష అంతకుమించి ఉంటే 
→ ఒకటి లేదా అంతకు మించిన క్రెడిట్‌ కార్డులకు డిజిటల్‌ చెల్లింపుల మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు, అంతకు మించితే. 
→ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించిన మొత్తంతో టైమ్‌ డిపాజిట్‌ (రెన్యువల్‌ కాకుండా) చేయడం. 
→ బాండ్లు లేదా డిబెంచర్లపై మొత్తం మీద (ఒకటికి మించిన లావాదేవీలు కూడా) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి ఇన్వెస్ట్‌ చేయడం. 
→ షేర్ల కొనుగోలు విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు (ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం), అంతకుమించినప్పుడు ఎస్‌ఎఫ్‌టీ ద్వారా బ్రోకర్లు ఐటీ శాఖకు ఫైల్‌ చేయాల్సిందే. 
→ షేర్ల బైబ్యాక్‌లో పాల్గొని విక్రయించిన మొత్తం రూ.10 లక్షలు అంతకుమించిన సందర్భాల్లో. 
→ మ్యూచువల్‌ ఫండ్స్‌లో యూనిట్లపై పెట్టుబడి రూ.10 లక్షలు అంంతకుమించిన సందర్భాల్లో. 
→ స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయం విలువ (రిజిస్ట్రేషన్‌ వ్యాల్యూ/ప్రభుత్వ మార్కెట్‌ విలువ లేదా రికార్డు అయిన అసలు కొనుగోలు/విక్రయం విలువ)  రూ.30 లక్షలు అంతకుమించిన సందర్భాల్లో రిజిస్టార్‌ లేదా సబ్‌ రిజి్రస్టార్‌ నివేదించాల్సి ఉంటుంది. 
→ ఫారీన్‌ కరెన్సీ కోసం రూ.10 లక్షలు అంతకుమించిన చెల్లింపులు చేసినప్పుడు. 
→ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు లేదా ట్రావెలర్స్‌ చెక్కు లేదా డ్రాఫ్ట్‌ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి ఖర్చు చేసిన సందర్భాల్లో సమాచారం ఎస్‌ఎఫ్‌టీ రూపంలో ఐటీ శాఖకు వెళుతుంది.   

 రిజిస్ట్రార్‌ అండ్‌ షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్, రిజి్రస్టార్‌ కార్యాలయాలు తదితర) ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాతి మే 31లోపు ఎస్‌ఎఫ్‌టీలను నమోదు చేయాల్సింఇక్కడ చెప్పిన పరిమితులన్నీ ఒక ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి అమలవుతాయి. రిపోర్టింగ్‌ ఎంటీటీలు (బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ట్రస్టీలు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌దే.
– సంజోలి మహేశ్వరి , నాంజియా అండ్‌ కో ఎల్‌ఎల్‌పీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు.

వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌) 
వేతనాలు, వడ్డీ ఆదాయం, డివిడెండ్‌లు, ఇల్లు/ప్లాంట్లు/మెíÙనరీలపై అద్దె ఆదాయం తదితర లావాదేవీల వివరాలతోపాటు.. టీడీఎస్, టీసీఎస్, జీఎస్‌టీ ఇతర పన్ను సంబంధిత వివరాలు, రెమిటెన్స్‌లు (విదేశీ చెల్లింపులు/స్వీకరణలు), షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్, బాండ్లలో పెట్టుబడులు/ఉపసంహరణలు, ఆఫ్‌ మార్కెట్‌ కొనుగోళ్లు/విక్రయాలు, ప్రాపర్టీల క్రయ/విక్రయాలు ఇలా సమగ్ర సమాచార నివేదికగా ఏఐఎస్‌ ఉంటుంది. అంతేకాదు బంగారం, కార్లు తదితర అధిక విలువ కొనుగోళ్లు, కమీషన్ల ఆదాయం, విదేశీ పర్యటనలపై అధిక వ్యయాలు, జీవిత బీమా పాలసీల నుంచి అందుకున్న మొత్తం, లాటరీ/బెట్టింగ్‌ల్లో గెలుచుకుంటే, ఆయా వివరాలు కూడా ఇందులోకి చేరతాయి. 

దీన్ని రిటర్నుల దాఖలుకు ముందు ఒకసారి పరిశీలించుకుని, అందులోని వివరాలు/లావాదేవీలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిపై తమ అభిప్రాయాలను ఆదాయపన్ను శాఖకు నివేదించొచ్చు. ఉదాహరణకు ఏదైనా పెట్టుబడి విషయంలో అసలు కంటే అధిక మొత్తం ఉన్నట్టు గుర్తించినట్టయితే ఇదే విషయాన్ని ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లొచ్చు. దాంతో అది సవరణకు గురవుతుంది. పన్ను చెల్లింపుదారుడికి సంబంధించి సమగ్రమైన ఆర్థిక సమాచార నివేదిక ఇది. పూర్తిగా పరిశీలించుకుని, నిబంధనల ప్రకారం ఆ వివరాలను ఐటీఆర్‌లో స్వచ్ఛందంగా వెల్లడించే దిశగా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. 

ఫారమ్‌ 26ఏఎస్‌ 
ఫారమ్‌ 26ఏఎస్‌ అన్నది పన్ను చెల్లింపుదారుడి ఆదాయంపై మినహాయించిన టీడీఎస్, వ్యయాలపై వసూలు చేసిన టీసీఎస్, ప్రాపర్టీ క్రయ/విక్రయాల వివరాలతో ఉంటుంది. ఏఐఎస్, ఫారమ్‌ 26ఏఎస్‌ను ఆదాయపన్ను ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ నుంచి పొందొచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement