
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) గడువును 2025 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారని.. కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందిస్తూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.
ఐటీఆర్‌లను దాఖలు చేయాల్సిన గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ గడువును ఈ నెల 30 వరకు పొడిగించారని వస్తున్న వార్తలలో నిజం లేదు. అదంతా అవాస్తవం. దానిని నమ్మవద్దు అని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపు, ఇతర సంబంధిత సేవల కోసం పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి, మా హెల్ప్‌డెస్క్ 24x7 అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు తేదీ పెంచాలని.. పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ (కటక్), పీపీ చౌదరి (పాలీ).. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాసి గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. కానీ మంత్రిత్వశాఖ గడువు పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్నిబట్టి చూస్తే.. గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
A fake news is in circulation stating that the due of filing ITRs (originally due on 31.07.2025, and extended to 15.09.2025) has been further extended to 30.09.2025.
✅ The due date for filing ITRs remains 15.09.2025.
Taxpayers are advised to rely only on official… pic.twitter.com/F7fPEOAztZ— Income Tax India (@IncomeTaxIndia) September 14, 2025
ఆలస్య రుసుముతో ఐటీఆర్ ఫైలింగ్
గడువు తీరని తరువాత.. డిసెంబర్ 31, 2025 వరకు రూ.5000 వరకు ఆలస్య రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి జరిమానా గరిష్టంగా రూ.1000 ఉంటుంది. ఇక్కడ ఫైన్ ఒక్కటే సమస్య కాదు. కొన్నిసార్లు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ప్రాసిక్యూషన్ కూడా ఉండవచ్చు. గత సంవత్సరం.. ఢిల్లీలోని ఒక మహిళ తన ఐటీఆర్ దాఖలు చేయనందుకు ఆమెకు జైలు శిక్ష విధించారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే.. గడువు లోపలే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం ఉత్తమం.