మ్యాన్‌హోల్‌లోకి మరమనిషి..!

TS Government Use Bandicoot Robot For Cleaning Manholes - Sakshi

రాష్ట్రంలో తొలిసారి పూడికతీతకు రోబో సేవలు

‘బండికూట్‌’ రోబోను తయారు చేసిన జెన్‌రోబోటిక్స్‌ సంస్థ

సీఆర్‌ఎస్‌ కింద బండికూట్‌ను సమకూర్చిన కే రహేజా గ్రూపు

ఆపరేటర్, క్లీనర్‌ సాయంతో పనులు  

గచ్చిబౌలి: మ్యాన్‌హోల్‌లో పూడిక తీసే కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టు కోవాల్సిందే. లోపలికి దిగిన కార్మికులు విష వాయువుల బారిన పడి మృతి చెందిన సంఘటనలు ఎన్నో చూశాం. ఇకపై కార్మికుల స్థానంలో రోబోలు మ్యాన్‌హోల్‌లోకి దిగి పూడిక తీయనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి రోబోతో పూడిక తీత పనులు ప్రారంభించింది. ఈ పనుల కోసం జెన్‌ రోబోటిక్స్‌ సంస్థ తయారు చేసిన ‘బండికూట్‌’అనే రోబోను జీహెచ్‌ఎంసీ ఉపయోగించింది. కేరహేజా గ్రూపు సీఎస్‌ఆర్‌లో భాగంగా ఈ రోబోను జీహెచ్‌ఎంసీకి అందించింది. ఇప్పటికే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, హరియాణా, మహారాష్ట్రల్లో ఈ రోబోను ఉప యోగించి లోతైన మ్యాన్‌హోల్స్‌లో పూడిక తీస్తున్నారు. సోమవారం రాయదుర్గంలో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో  బండికూట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పూడికతీత ఇలా..
ముందుగా మ్యాన్‌హోల్‌లోకి రోబోటిక్‌ యూనిట్‌ను పంపుతారు. రోబోలోని కెమెరాలు లోపల పూడిక ఏ భాగంలో ఉందో అవి పసికడతాయి. పైన ఆపరేటర్‌ వద్ద ‘యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ ప్యానల్‌’లో అన్ని దృశ్యాలు కనిపిస్తాయి. దీని ఆధారంగా ఆ ప్యానల్‌పై ఉన్న బటన్‌లను నొక్కుతూ పూడికను బయటకు తీస్తారు. చేయి ఆకారంలో ఉన్న ఆర్మ్‌ పైప్‌లైన్‌ మ్యాన్‌హోల్‌లోని బురద, మట్టిని బకెట్‌లోకి వేస్తుంది. ఈ ఆర్మ్‌ 1.2 మీటర్ల వరకు సాగుతుంది. మ్యాన్‌హోల్‌పైన ఉన్న ఆపరేటర్‌ మట్టి, బురదను బయటకు తీస్తే, పైకి వచ్చిన బకెట్‌ను క్లీనర్‌ ఖాళీ చేసి మళ్లీ లోపలకు పంపిస్తారు. దీంతో కార్మికులను లోపలికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. 

విష వాయువులను పసిగడుతుంది..
మ్యాన్‌హోల్‌లో లిథియం, కార్భన్‌ మోనాక్సైడ్, అమోనియా లాంటి విషవాయువుల తీవ్రత ఎంత ఉందో ప్యానల్‌లో చూపిస్తుంది. ఎక్కువ మోతాదులో ఉంటే రెడ్‌ లైట్‌ వస్తుంది. వీటి తీవ్రత ప్రమాదకరంగా ఉన్నట్లయితే అలారం కూడా మోగుతుంది. దీంతో మ్యాన్‌హోల్‌ సమీపంలో నిలబడి ఉన్న ఆపరేటర్, క్లీనర్‌లు కొద్దిసేపు పక్కకు జరిగేందుకు వీలుంటుంది.

బండికూట్‌ ప్రత్యేకతలు..
బండికూట్‌ రోబో ఖరీదు రూ.32 లక్షలు. దీనిని కార్బన్‌ ఫైబర్‌ బాడీతో తయారు చేయడం వల్ల తక్కువ బరువుగా ఉంటుంది. దీంతో తేలికగా మరో చోటికి తరలించవచ్చు. 8 మీటర్లు అంటే 24 అడుగుల లోతు మ్యాన్‌హోల్‌లో పూడిక తీస్తుంది. మట్టి, బురదను బయటకు తీసుకొచ్చే బకెట్‌ కెపాసిటీ 16 లీటర్లు ఉంటుంది. 3 కేవీఏ కెపాసిటీ గల జనరేటర్‌ సాయంతో పనిచేస్తుంది. 4 చక్రాలు ఉన్న బండికూట్‌కు 4 కెమెరాలు ఉంటాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top