సర్దుకుపోదాం...

TRS Party Leaders Disagreement Medak - Sakshi

సాక్షి, మెదక్‌: నర్సాపూర్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు వెళ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో రగులుతున్న ఈ అసంతృప్తి జ్వాలలను చల్లార్చి అందరినీ ఏకతాటి మీదికి తెచ్చేందుకు ట్రబుల్‌ షూటర్‌ ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగుతున్నారు. గురువారం ఆయన నర్సాపూర్‌కు రానున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు సన్నద్దతపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీలోని అసంతృప్త నేతలతోనూ మాట్లాడి  బుజ్జగించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి రాకతోనైనా నియోజకవర్గంలోని అసంతృప్తి నేతలు దారిలోకి వస్తారని మదన్‌రెడ్డి వర్గీయులు ఆశిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయం తీసుకోకముందు నుంచి మదన్‌రెడ్డిపై పలువురు టీఆర్‌ఎస్‌ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావన ఉంది. దీనికితోడు మదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నేత మురళీయాదవ్‌కు మధ్య తీవ్ర విభేదాలున్నాయి. మదన్‌రెడ్డికి తిరిగి ఎమ్మెల్యే టికెట్‌ దక్కటంతో మురళీయాదవ్‌లో అసంతృప్తి మరింత పెరిగింది. పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగా పోటీచేయాలని మురళీ భావించారు. అయితే మంత్రి బుజ్జగించటంలో వెనకడుగు వేశారు. పార్టీ మారనప్పటికీ మదన్‌రెడ్డితో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా మనస్ఫూర్తిగా పనిచేయడం లేదని, నియోజకవర్గంలో నాయకులను రెచ్చగొడుతున్నారని మదన్‌రెడ్డి వర్గీయులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ విషయాన్ని మదన్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బుధవారం నర్సాపూర్‌కు రానున్న మంత్రి హరీష్‌రావు అసంతృప్తి నేత మురళీయాదవ్‌తో ప్రత్యేకంగా మాట్లాడనున్నట్లు తెలిసింది. బుధవారం జరిగే సమావేశంలో మదన్‌రెడ్డి, మురళీయాదవ్‌లు కలిసిపోయారన్న భావన కార్యకర్తల్లోకి బలంగా వెళ్లేలా వారితోనే చెప్పించనున్నట్లు సమాచారం.

నామినేటెడ్‌ పోస్టు ఇవ్వలేదని..
ఇటీవల మృతిచెందిన టీఆర్‌ఎస్‌ నేత కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డితో కూడా మంత్రి సమావేశం అయ్యే అవకాశం ఉంది. సీపీఐ నేతగా ఉన్న కిషన్‌రెడ్డి గత ఎన్నికల్లో తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పుడు  మదన్‌రెడ్డి విజయానికి ఆయన కృషి చేశారు. కిషన్‌రెడ్డికి నామినేటెడ్‌ పదవి ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధిష్టానం హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. దురదృష్టవశాత్తు ఇటీవలే ఆయన మృతి చెందిన విషయం తెలిసిందె. టీఆర్‌ఎస్‌ అధిష్టానం తీరుపై కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డితోపాటు ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సుహాసినిరెడ్డితో సమావేశం కానున్నారు. బుధవారం నర్సాపూర్‌లో అందుబాటులో ఉండాలని, పార్టీ సమావేశానికి హాజరు కావాలని ఆమెను కోరినట్లు తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం తీరుతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బుధవారం జరిగే సమావేశంలో ఆయనను కూడా బుజ్జగించనున్నారు.  హత్నూర జెడ్పీటీసీ పల్లె జయశ్రీ, కొల్చారం మండల నాయకురాలు, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ముదిరాజ్‌లు నర్సాపూర్‌ ఆత్మకమిటీ చైర్మన్‌ శివకుమార్, నర్సాపూర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మాధవరెడ్డి, కౌడిపల్లి మాజీ ఎంపీపీ యాదాగౌడ్‌ పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదన్న అసంతృప్తితో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి దూరంగా ఉంటున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని నాయకులు అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉండటం నష్టం కలిగిస్తుందని భావిస్తున్న మంత్రి హరీశ్‌రావు వారితో మాట్లాడి ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు  సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అసంతృప్తి నేతలంతా ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసేలా మంత్రి చూడనున్నారు. ఆయన చర్యలతోనైనా టీఆర్‌ఎస్‌ పార్టీలో విభేదాలు సమసిపోతాయో లేదో వేచి చూడాల్సి ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top