అవినీతి నిరూపిస్తే రాజీనామా | Sakshi
Sakshi News home page

అవినీతి నిరూపిస్తే రాజీనామా

Published Sun, Apr 8 2018 11:10 AM

TRS MLA Criticised Opposition Party In Khammam - Sakshi

ఖమ్మంఅర్బన్‌ : అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్‌ పాపాలాల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కొన్ని రాజకీయ పక్షాలు పనికట్టుకుని పసలేని ఆరోపణలు చేస్తున్నాయని, వీటిని ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని, తన హయాంలోనే ఖమ్మం రూపురేఖలు ఎలా మారాయో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మంజూరు చేయిం చామని, ఇందులో అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు ఎంతమాత్రం లేదన్నారు.

సీఎం కేసీఆర్‌ పిలుపు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాగితాలపై రచించిన ఖమ్మం అభివృద్ధి పనుల్లో ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. తొలివిడతగా రఘునాథపాలెం మండలం శివాయిగూడెం వద్ద 216 డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నామని, మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు. పదేళ్ల క్రితం పట్టాలకే పరిమితం చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కూడా అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. నగరంలో రహదారులు, లకారం చెరువు అభివృద్ధి, కొత్త షాదీఖానా మంజూరు, గోళ్లపాడు చానల్‌ అభివృద్ధి, తాగునీటి పథకం ఇలా అనేక పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు.   

9న నలుగురు మంత్రుల రాక..
ఈనెల 9న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సలు చేసేందుకు మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. హెలికాప్టర్‌ ద్వారా ఖమ్మం చేరుకుని.. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తారని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, పట్టాల పంపిణీ, కూరగాయల మార్కెట్, రోడ్ల విస్తరణ, డ్రెయినేజీ, షాదీఖానా, జిమ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. టీటీడీసీ భవనంలో కార్పొరేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మధిర పర్యటనకు వెళ్లి.. సాయంత్రం 7 గంటలకు మమత మెడికల్‌ కళాశాల 20 ఏళ్ల సంబరాల వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల నాగరాజు, కొత్తపల్లి నీరజ, కర్నాటి కృష్ణ, మందడపు మనోహర్, కూరాకుల వలరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ మందడపు సుధాకర్, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ మందడపు నరసింహారావు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం, జెడ్పీటీసీ వీరూనాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement