ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం

TRS Government Supported Muslim Minorities says Mahmad Ali - Sakshi

12శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నాం

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది 

ముస్లిం మైనార్టీల సభలో ఉప ముఖ్యమంత్రి మహముద్‌ అలీ

సాక్షి, షాద్‌నగర్‌టౌన్‌: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, 12 శాతం రిజర్వేషన్‌కు తాము కట్టుబడి ఉన్నామని ఉప ముఖ్యమంత్రి మహముద్‌ అలీ అన్నారు. గురువారం షాద్‌నగర్‌ పట్టణంలో జరిగిన ముస్లిం మైనార్టీల సభలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తమ పార్టీ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ఆలోచనే ఉంటే 1969లోనే  ఏర్పాటయ్యేదన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు అలుపెరుగని ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్రాన్ని సాధించారన్నారు. సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. దర్గాలు, మసీదుల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, టీఆర్‌ఎస్‌ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రిజర్వేషన్లు కల్పించుకునే అధికారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కృషిచేసింది కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కేసీఆర్‌ తగిన నిధులు కేటాయించారని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి అంజయ్య యాదవ్, నాయకులు ఇంతియాజ్, రహిముల్లాఖాన్, జిల్లెల వెంకట్‌రెడ్డి, జామి, ఇద్రీస్, నటరాజ్, యూసుఫ్‌ బామస్, సర్వర్‌పాషా, జమృద్‌ఖాన్, సలీం, ఎక్బాల్, అందెబాబయ్య, రాజ్యలక్ష్మి, గుల్లె కృష్ణయ్య, యుగెంధర్, చింటు,  అశోక్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఈట గణేష్,  శరత్‌కృష్ణ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top