కేసీఆర్‌ ఎన్నికల రథానికి.. జెండాపై రైతన్న

TRS Government Main Priority to formers in 2018-19 Budget - Sakshi

అన్నదాత లక్ష్యంగా సర్కారు భారీ పద్దు 

వ్యవసాయం, సాగునీటికి పెద్దపీట 

బడ్జెట్‌లో సింహభాగం వాటికే..

26 శాతం నిధుల కేటాయింపు 

‘పెట్టుబడి’ పథకానికి రూ.12 వేల కోట్లు 

రూ.5 లక్షల బీమాతో రైతులందరికీ ధీమా.. రూ. 500 కోట్ల కేటాయింపు 

వడ్డీలేని పంట రుణాలకు రూ.500 కోట్లు 

సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు 

వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.20 వేల కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నాగేటి సాళ్లకు నిధుల వరద పారించింది. గతంలో ఎన్నడూలేని విధంగా వ్యవసాయానికి భారీగా కేటాయింపులు చేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఏకంగా 26 శాతం నిధులను సాగుకే మళ్లించింది. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో అన్నదాతలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాలు, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈసారి రైతులోకాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. కొత్త రాష్ట్రం ఏర్పడగానే మొదటి బడ్జెట్‌లో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసిన సర్కారు ఈసారి.. వారికోసం రెండు భారీ వరాలు ప్రకటించింది. 

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుగానే ప్రకటించినట్టుగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందించే బృహత్తర పథకాన్ని ప్రకటించింది. పునాస పంటలకు ఏప్రిల్‌లో, యాసంగి పంటలకు నవంబర్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. దీనికితోడు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ‘రైతు బీమా పథకం’ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించేందుకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ రెండు పథకాలు మినహా బడ్జెట్‌లో కొత్త వరాలేమీ ప్రకటించలేదు. 

రైతులకిచ్చే వడ్డీలేని పంట రుణాలకు రూ.500 కోట్లు, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రూ.522 కోట్లు కేటాయించింది. ట్రాక్టర్లు, సేద్యపు పరికరాలతోపాటు నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందిస్తామని వెల్లడించింది. ప్రభుత్వానికి రైతులకు అనుసంధానంగా రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసింది. పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర రానట్లయితే రైతు సమన్వయ సమితి నేరుగా వాటిని కొనుగోలు చేస్తుందని, అందుకు తగిన నిధులను సమకూరుస్తామని భరోసానిచ్చింది. 2018–19 సంవత్సరానికి మొత్తం రూ.1.74 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందులో రూ.20,820 కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకే వెచ్చించనుంది. 

సాగునీటికి గతేడాది మాదిరే.. 
వ్యవసాయం తర్వాత సాగునీటి రంగానికి రెండో ప్రాధాన్యమిచ్చింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి గతేడాది తరహాలోనే రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంలో భాగంగా ప్రాజెక్టులపై ఖర్చు చేసే నిధులు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుకు వెచ్చించే నిధులు రైతు ప్రయోజనాలను ఉద్దేశించినవే కావటం గమనార్హం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సబ్సిడీకి రూ.4,984 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా.. అది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌గా ఉంటుంది. అందుకే సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌లో అన్ని వర్గాలపై ప్రభుత్వం వరాలు కురిపిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఆకర్షనీయ పథకాల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. 

రైతుల తర్వాత మైనారిటీలు 
రాష్ట్రంలో మొత్తం 76 లక్షల మంది రైతులున్నారు. వారిని ఆకట్టుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. అన్నదాతల తర్వాత మైనారిటీలను ఆకట్టుకునేందుకు ఎక్కువ నిధులు వెచ్చించింది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్‌లో మైనారిటీలకు రూ.4,400 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు వెచ్చించిందని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. 

బీసీలు, ఎంబీసీలకు పాత నిధులే 
గతేడాది బీసీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం వాటిని ఖర్చు చేయటంలో మాత్రం ఆసక్తి కనబరచలేదు. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) గతేడాది రూ.వెయ్యి కోట్లు కేటాయించినా నిధులు ఖర్చు చేయలేదు. అయినా ఈసారి రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ యువతకు భారీ సబ్సిడీపై స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. మూడేళ్లుగా ఆచరణలో విఫలమైంది. 

ఈసారి ఆర్థిక చేయూతనిచ్చే స్వయం ఉపాధి పథకాలకు రూ.1,682 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 38 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న ఆసరా పెన్షన్లకు రూ.5,366 కోట్లు కేటాయించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులకు రూ.3,282 కోట్లు కేటాయించింది. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధికి(సీడీపీ) రూ.480 కోట్లు వెచ్చించనుంది. వరుసగా నాలుగేళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మిషన్‌ భగీరథ పథకానికి రూ.1,803 కోట్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. 

బడ్జెటేతర నిధులతో వీటిని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రభుత్వం తరఫున అందిస్తామని ప్రకటించిన సీఎం.. బడ్జెట్‌లో ఈ మేరకు నిధులు సర్దుబాటు చేశారు. గ్రామ పంచాయతీల నిధికి రూ.1,500 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,000 కోట్ల కేటాయింపులు చేసింది. కార్పొరేషన్లకు కూడా రూ.700 కోట్ల ప్రత్యేక నిధిని ప్రకటించింది. 

ముఖ్యమంత్రి నిధి 3 వేల కోట్లు 
గతంలో ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధికి బడ్జెట్‌ నుంచి కేటాయింపులు చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈసారి రూ.3000 కోట్లు కేటాయించినా బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్‌ఆర్‌ఐ శాఖకు ఈసారి రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో ప్రవాస తెలంగాణవాసుల అభివృద్ధి, సంక్షేమానికి కొత్త కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గల్ఫ్‌లో ఉన్న తెలంగాణవాసుల కష్టాలు తీర్చేందుకు ఈ నిధులను వెచ్చించే అవకాశాలున్నాయి.  

బడ్జెట్‌  2018-19

మొత్తం బడ్జెట్‌: 1,74,453.83 

ప్రగతి పద్దు: 1,04,757.90 

నిర్వహణ పద్దు:69,695.93 ( రూ. కోట్లలో)

బడ్జెట్‌పై సాక్షి మరిన్ని కథనాల కోసం క్లిక్‌ చేయండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top